సెప్టెంబర్‌కు ముక్త్యాల బ్రాంచి కెనాల్ పూర్తి – 45 వేల ఎకరాలకు సాగునీరు మహాత్మా గాంధీ ముక్త్యాల బ్రాంచి కెనాల్ ఎత్తిపోతల పథకం పనులపై సమీక్ష 23 గ్రామాలకు సాగునీరు మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి

Nalgonda Bureau
1 Min Read

చింతలపాలెం, ఫిబ్రవరి 26 (ప్రజా జ్యోతి): రూ.1642 కోట్ల వ్యయంతో 45 వేల ఎకరాలకు సాగునీరు అందించే మహాత్మా గాంధీ ముక్త్యాల బ్రాంచి కెనాల్ ఎత్తిపోతల పథకం పనులను గురువారం రాష్ట్ర ఆహార పౌరసరఫరాల మరియు నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. అనంతరం ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా మూడు మండలాల్లోని 23 గ్రామాలకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. మట్టపల్లి మండలంలోని 9 గ్రామాలు, చింతలపాలెం మండలంలోని 5 గ్రామాలు, మేళ్లచెరువు మండలంలోని 9 గ్రామాలు ఈ పథకం పరిధిలోకి వస్తాయని వివరించారు. 16 మెగావాట్ల సామర్థ్యంతో నాలుగు పంపు సెట్ల ద్వారా 160 మీటర్ల లోతు నుంచి నీటిని ఎత్తి సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి 198 ఎకరాల భూసేకరణ చేపట్టి రైతులకు రూ.53 కోట్ల పరిహారం చెల్లించినట్లు తెలిపారు. వచ్చే సెప్టెంబర్ నాటికి పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల ఎస్సీ నాగభూషణం, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నందిరెడ్డి ఇంద్రారెడ్డి, చిలకల శ్రీనివాసరెడ్డి, మోర్తాల సీతారెడ్డి, తోట అంజయ్య, లకావత్ సైదులు, జెట్టి నాగిరెడ్డి, కాంట్రాక్టర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *