భారత్‌కు గుడ్ న్యూస్.. చెన్నైలో కొత్త పిచ్.. బ్యాటర్లకు పండగే

V. Sai Krishna Reddy
2 Min Read

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్ ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారీ తేడాతో ఓటమి పాలవ్వడం టీమిండియా అవకాశాలను సంక్లిష్టంగా మార్చింది. దీనికి తోడు జింబాబ్వేపై వెస్టిండీస్ 106 పరుగుల భారీ తేడాతో గెలవడంతో భారత జట్టుపై ఒత్తిడి మరింత పెరిగింది. సెమీస్ రేసులో నిలవాలంటే, భారత్ తన తదుపరి రెండు మ్యాచ్‌లలో కేవలం గెలవడమే కాకుండా, నెట్ రన్ రేట్ (NRR) మెరుగుపర్చుకునేందుకు భారీ తేడాతో విజయాలు సాధించడం తప్పనిసరి.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత జట్టుకు ఓ సానుకూల వార్త ఊరటనిస్తోంది. రేపు జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలోని కొత్త పిచ్‌పై నిర్వహించనున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఈ పిచ్‌ను ప్రపంచకప్‌కు కొద్ది రోజుల ముందే సిద్ధం చేశారని, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి దేశవాళీ మ్యాచ్‌లు జరగలేదని తెలిసింది. దీంతో బంతి బ్యాట్‌పైకి సులభంగా వస్తుందని, ఇది బ్యాటర్లకు భారీగా కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. భారీ స్కోర్లు సాధించి నెట్ రన్ రేట్ మెరుగుపరుచుకోవాలనుకుంటున్న భారత్‌కు ఇది శుభవార్తే.

భారత్ తన తదుపరి మ్యాచ్‌లలో జింబాబ్వే, వెస్టిండీస్‌లతో తలపడనుంది. ఈ రెండింటిలోనూ గెలిస్తే, జట్టు ఖాతాలో 4 పాయింట్లు ఉంటాయి. మరోవైపు గ్రూప్ 1లో దక్షిణాఫ్రికా తన మిగిలిన మ్యాచ్‌లన్నింటిలోనూ విజయం సాధిస్తే, భారత్ నేరుగా సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. అయితే, దక్షిణాఫ్రికా గనుక వెస్టిండీస్ చేతిలో ఓడితే సమీకరణాలు ఉత్కంఠగా మారతాయి. అప్పుడు భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మూడు జట్లు 4 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. ఈ దశలో అత్యుత్తమ నెట్ రన్ రేట్ ఉన్న రెండు జట్లు సెమీస్‌కు వెళ‌తాయి.

టీమిండియా తన సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే, వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో గెలవడం అత్యంత కీలకం. ఈ మ్యాచ్‌లో ఓడితే దాదాపుగా టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే. మొత్తం మీద భారత్ సెమీస్ భవితవ్యం కేవలం వారి ప్రదర్శనపైనే కాకుండా దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ మ్యాచ్ ఫలితంపై కూడా అధికంగా ఆధారపడి ఉంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *