సేవా తీర్థ్‌లో తొలి కేబినెట్ భేటీ… కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్రం

V. Sai Krishna Reddy
2 Min Read

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం మంగళవారం పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. నూతనంగా ప్రారంభమైన ‘సేవా తీర్థ్’ సముదాయంలో జరిగిన ఈ తొలి సమావేశంలో, దేశవ్యాప్తంగా బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ టీకా అందించడం, కేరళ పేరును ‘కేరళం’గా మార్చడం సహా అనేక కీలక ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. దీంతో పాటు, రాబోయే రోజుల్లో భారత్‌ను ప్రపంచంలోని మూడు అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలబెట్టడమే లక్ష్యంగా ‘సేవా సంకల్ప్’ పేరిట ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించింది.

నేడు ‘సేవా తీర్థ్’ ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశం దేశ ప్రగతి ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది అని కేబినెట్ అభివర్ణించింది. వలసవాద గతం నుంచి ఆత్మవిశ్వాసంతో కూడిన నవ భారతం వైపు సాగుతున్న ప్రయాణానికి ఈ నూతన పరిపాలనా కేంద్రం ఒక శక్తివంతమైన చిహ్నమని తీర్మానంలో పేర్కొన్నారు. ‘సేవా తీర్థ్’ అనే పేరు సేవ, బాధ్యత, అంకితభావాలకు ప్రతిరూపమని, ఇక్కడ పరిపాలనను ఒక పవిత్ర యాత్రగా భావిస్తామని వివరించారు. ఈ సమావేశంపై ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ.. “స్వదేశీ ఆలోచన, ఆధునిక దృక్పథం, 140 కోట్ల ప్రజల అపార సామర్థ్యంతో భారతదేశాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు సంకల్పం చేశాం” అని తెలిపారు.

ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాల్లో భాగంగా, బాలికల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ దేశవ్యాప్తంగా 14 ఏళ్ల బాలికలకు ఉచితంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిరోధక (హెచ్‌పీవీ) ‘గర్దాసిల్’ టీకాను అందించే కార్యక్రమానికి పచ్చజెండా ఊపారు. అదేవిధంగా, కేరళ రాష్ట్రం పేరును అధికారికంగా ‘కేరళం’గా మార్చే ప్రతిపాదనను కూడా కేబినెట్ ఆమోదించింది.

మౌలిక సదుపాయాల కల్పనకు ఊతమిస్తూ సుమారు రూ.12,236 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో అహ్మదాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు, జబల్‌పూర్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులు ఉన్నాయి. వీటితో పాటు దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసే సంస్కరణలకు కూడా ఆమోదం లభించింది.

ప్రభుత్వ పరిపాలన అధికార కేంద్రంగా కాకుండా, ప్రజల సాధికారతకు కేంద్రంగా పనిచేయాలని ‘సేవా సంకల్ప్’ తీర్మానంలో స్పష్టం చేశారు. ‘నాగరిక దేవో భవ’ (పౌరుడే దైవం) అనే సూత్రాన్ని పాటిస్తూ, ప్రతి నిర్ణయం 140 కోట్ల ప్రజల సేవకే అంకితమవుతుందని పేర్కొన్నారు. గత దశాబ్దంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడాన్ని గుర్తుచేస్తూ.. ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వేగంతో భారత్‌ను త్వరలోనే ప్రపంచంలోని టాప్-3 ఆర్థిక శక్తిగా నిలబెట్టేందుకు దృఢ సంకల్పం తీసుకున్నట్లు తెలిపారు. మొత్తం మీద, ఈ సమావేశం 2047 నాటికి ‘వికసిత భారత్’ లక్ష్యాన్ని సాధించే దిశగా ఒక బలమైన పునాది వేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *