మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం: సీఎం రేవంత్ రెడ్డి

V. Sai Krishna Reddy
2 Min Read

తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తమ రెండేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన బలమైన తీర్పు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రజా ప్రభుత్వ పాలనకు, పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమానికి, ప్రపంచస్థాయి ప్రణాళికలతో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఈ తీర్పు ద్వారా ప్రజలు సంపూర్ణ ఆమోదం తెలిపారని ఆయన శుక్రవారం పేర్కొన్నారు.

రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. వెలువడిన ఫలితాల ప్రకారం, 116 మున్సిపాలిటీలకు గాను 66 చోట్ల కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. అలాగే 7 కార్పొరేషన్లలో 3 చోట్ల స్పష్టమైన మెజారిటీ సాధించగా, మరో కార్పొరేషన్‌లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని మరో 37 మున్సిపాలిటీలలో కూడా పీఠాలను కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఈ చారిత్రక విజయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. “లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల అవిశ్రాంత శ్రమకు దక్కిన ఫలితమే ఈ విజయం. పార్టీ పట్ల వారికి ఉన్న అపారమైన అభిమానానికి ఇది నిలువుటద్దం. పార్టీ జెండాను మోసి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను” అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

ఈ గెలుపు తమ బాధ్యతను మరింత పెంచిందని సీఎం అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి, పారదర్శక పాలనకు తాము పునరంకితం అవుతున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీని, ప్రతి కార్పొరేషన్‌ను అభివృద్ధి పథంలో నడిపించి చూపిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ ఫలితాలు ప్రభుత్వ పనితీరుకు ప్రజలు ఇచ్చిన సానుకూల తీర్పుగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *