వివాహమైనా.. మతం మారినా కులం మారదు: అలహాబాద్ హైకోర్టు

V. Sai Krishna Reddy
1 Min Read

వివాహం లేదా మత మార్పిడి కారణంగా ఒక వ్యక్తి పుట్టుకతో వచ్చిన కులం మారదని అలహాబాద్ హైకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులో నిందితులు దాఖలు చేసిన క్రిమినల్ అప్పీల్‌ను కొట్టివేస్తూ జస్టిస్ అనిల్ కుమార్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

పశ్చిమ బెంగాల్‌లోని ఎస్సీ వర్గానికి చెందిన ఓ మహిళపై దినేశ్ అనే వ్యక్తితో పాటు మరో 8 మంది దాడి చేసి, కులం పేరుతో దూషించారు. ఈ ఘటనలో బాధితురాలితో సహా ముగ్గురు గాయపడ్డారు. దీంతో బాధితురాలు వారిపై అలీగఢ్‌లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఐపీసీతో పాటు ఎస్సీ/ఎస్టీ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ప్రత్యేక న్యాయస్థానం నిందితులను ఆదేశించింది.

అయితే, బాధితురాలు జాట్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవడం వల్ల ఆమె ఎస్సీ హోదా కోల్పోయిందని, కాబట్టి తమపై ఎస్సీ/ఎస్టీ చట్టం వర్తించదని వాదిస్తూ నిందితులు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు.

ఈ అప్పీల్‌పై ఫిబ్రవరి 10న విచారణ జరిపిన న్యాయస్థానం, నిందితుల వాదనను తోసిపుచ్చింది. “ఒక వ్యక్తి మతం మారినా, పెళ్లి చేసుకున్నా పుట్టుకతో వచ్చిన కులం మారదు. కాబట్టి పిటిషనర్ల వాదన నిరాధారమైనది” అని జస్టిస్ అనిల్ కుమార్ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. క్రాస్ కేసు ఉండటం అనేది ఫిర్యాదును కొట్టివేయడానికి ఒక కారణంగా పరిగణించలేమని పేర్కొంటూ, నిందితుల అప్పీల్‌ను కొట్టివేశారు. దీంతో నిందితులు అలీగఢ్ ప్రత్యేక కోర్టులో విచారణను ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *