మూగబోయిన మైకులు..ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం

-నేటితో ముగిసిన ప్రచారం -బోసిపోయిన వీధులు -అభ్యర్థుల్లో మొదలైన టెన్షన్ -ఓటరు చూపు ఎటు వైపో

Siddipet Bureau
1 Min Read

మూగబోయిన మైకులు..ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం

చేర్యాల, ఫిబ్రవరి 09 (ప్రజా జ్యోతి) గత వారం రోజులుగా ప్రచారాలతో హోరెత్తించిన మైకులు మూగబోయాయి. ఇన్ని రోజులు నాయకులుగా గెలవడానికి చేసిన ప్రచారాలు ఆగిపోయాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం పూర్తిగా బంద్ అయింది. దీంతో వారం రోజులుగా సందడిగా ఉన్న పట్టణంలోని వార్డులు, కాలనీలన్నీ నిశ్శబ్దంగా మారాయి. మున్సిపల్ ఎన్నికలకు కేవలం 48 గంటల సమయమే ఉండడంతో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులంతా అఖరి క్షణంలో ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

-ముగిసిన పోటాపోటీ ప్రచారాలు

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుండి చివరి రోజు వరకు పోటా పోటీగా బిఆర్ఎస్, బీజేపి, కాంగ్రెస్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున జనసమీకరణ చేసి ర్యాలీలు సభలు, సమావేశాలు నిర్వహించి ఓటర్లకు తాము గెలిస్తే చేయబోయే పనులు గురించి వివరించారు. కాగా చివరి రోజు అఖరి నిమిషం వరకు అభ్యర్థులు వివిధ రకాలుగా తమ ప్రచార వ్యూహాలను అమలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు.

అయితే అభ్యర్థుల ప్రచార కార్యక్రమాలు ముగియడంతో నాయకుల భవితవ్యం పూర్తిగా ఓటరు చేతిలో ఉండడంతో ఓటరు నాడి ఏవిధంగా ఉంటుందో, ఓటర్లు ఎవరికి పట్టం కడుతారో అనే ప్రశ్నలు అందరినీ తొలుస్తున్నాయి. మరి ఓటర్లు ఎవరికి ఓటు వేస్తారో, తమను నమ్ముకున్న వారికి ఎంత వరకు న్యాయం చేస్తారో తెలియాలంటే 13వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *