వ్యర్థపు కుప్పలు.. ప్రయాణికులకు తిప్పలు

Bharath Goud
1 Min Read

నర్సాపూర్ (ప్రజాజ్యోతి) పట్టణ సుందరీకరణ మాట దేవుడెరుగు.. కనీసం ప్రధాన కూడళ్లలో పారిశుధ్యాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. నర్సాపూర్ పట్టణ కేంద్రంలోని మెదక్ వెళ్లే మినీ ప్రయాణ ప్రాంగణం వద్ద నెలకొన్న దుస్థితి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. నిత్యం వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ ప్రాంతం ఇప్పుడు చెత్తాచెదారానికి నిలయంగా మారింది. బస్సుల కోసం వేచి చూసే ప్రయాణికులు కూర్చోవాల్సిన చోట మున్సిపల్ అధికారులు ‘చెత్త’కు ఆశ్రయం కల్పించారు. బస్టాప్ మెట్ల వద్దే ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలు విచ్చలవిడిగా పడి ఉండటంతో ఆ ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతోంది. బస్సు కోసం వేచి చూడాలంటేనే ప్రయాణికులు కంపరమెత్తిపోతున్నారు. మున్సిపల్ కార్మికులు నిత్యం ఈ దారి గుండానే వెళ్తున్నా, కంటి ముందే చెత్త కుప్పలు కనిపిస్తున్నా చూడనట్లు వ్యవహరించడం గమనార్హం.

•అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

పట్టణ పారిశుధ్యంపై మున్సిపల్ యంత్రాంగం పర్యవేక్షణ శూన్యమని ఈ దృశ్యాలే నిరూపిస్తున్నాయి. జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రధాన మినీ బస్టాప్ పరిస్థితే ఇలా ఉంటే, ఇక వార్డుల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందోనని ప్రజలు చెవులు కోరుకుంటున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి, ఈ ప్రాంతంలోని చెత్తను తొలగించడమే కాకుండా, అక్కడ నిత్యం పారిశుధ్య పనులు జరిగేలా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *