తప్పిన పెను ప్రమాదం.. ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ విమానం నిలిపివేత

V. Sai Krishna Reddy
2 Min Read

ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానంలో పెను ప్రమాదం తప్పింది. లండన్ నుంచి బెంగళూరు వచ్చిన ఈ విమానంలో కీలకమైన ‘ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్’ సరిగ్గా పనిచేయకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంజిన్‌కు ఇంధనాన్ని సరఫరా చేసే ఈ స్విచ్ ఆటోమేటిక్‌గా ‘కటాఫ్’ (ఆఫ్) పొజిషన్‌కు వెళ్తుండటంతో పైలట్లు ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ విమానాన్ని బెంగళూరు విమానాశ్రయంలోనే నిలిపివేసినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి వెల్లడించారు.

సోమవారం హీత్రూ నుంచి బెంగళూరు చేరుకున్న AI 132 విమానం ఇంజిన్ స్టార్ట్ చేసే సమయంలో ఈ లోపం బయటపడింది. సాధారణంగా ఇంజిన్ నడవాలంటే స్విచ్ ‘రన్’ మోడ్‌లో ఉండాలి. కానీ, ఈ విమానంలో రెండుసార్లు ఆ స్విచ్ తనంతట తానుగా ‘కటాఫ్’ పొజిషన్‌కు మారిపోయింది. దీనిపై వెంటనే స్పందించిన ఎయిర్ ఇండియా యాజమాన్యం విమాన తయారీ సంస్థ అయిన ‘బోయింగ్’ నిపుణులకు సమాచారం అందించింది.

ఈ సాంకేతిక లోపంపై ఆందోళన కలగడానికి ఒక బలమైన కారణం ఉంది. 2025 జూన్‌లో అహ్మదాబాద్‌లో జరిగిన భయంకరమైన డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదంలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదంపై వచ్చిన ప్రాథమిక నివేదిక ప్రకారం.. టేకాఫ్ అయిన కొద్ది సెకన్లకే రెండు ఇంజిన్ల ఫ్యూయల్ స్విచ్‌లు ఒకదాని తర్వాత ఒకటి ‘కటాఫ్’ పొజిషన్‌కు మారిపోయాయి. అప్పట్లో పైలట్లు తాము స్విచ్‌లు ఆపలేదని చెప్పినప్పటికీ ఇంజిన్లు పవర్ కోల్పోయి విమానం కుప్పకూలింది.

విమానంలో థ్రస్ట్ లివర్ల కింద ఉండే ఈ రెండు స్విచ్‌లు ఇంజిన్‌కు ఇంధన సరఫరాను నియంత్రిస్తాయి. ఇవి స్ప్రింగ్ మెకానిజంతో ఉంటాయి. పైలట్ కావాలని పైకి లాగి జరిపితే తప్ప ఇవి మారవు. ఒకవేళ గాలిలో ఉన్నప్పుడు ఇవి ‘కటాఫ్’ అయితే వెంటనే ఇంజిన్ ఆగిపోతుంది.

ఈ ఘటనపై విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం బోయింగ్ ప్రతినిధులు బెంగళూరులో ఈ విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేవలం ఒక విమానానికే ఈ సమస్య ఉందా లేక ఎయిర్ ఇండియా ఫ్లీట్‌లోని అన్ని 787 విమానాలకు ఉందా అనేది తేల్చనున్నారు. ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని, లోపం పూర్తిగా సరిదిద్దే వరకు ఈ విమానాన్ని నడపబోమని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *