నర్సాపూర్ (ప్రజాజ్యోతి) ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ప్రాణాల మీదకు వస్తోంది. నర్సాపూర్ బస్టాండ్ నుండి జేబీఎస్ వైపు వెళ్లే బస్సులో ప్రయాణికుల రద్దీ పెరిగి, బస్సు లోపల నిలబడే స్థలం లేకపోయినా.. కండక్టర్, డ్రైవర్లు బస్సును నడపడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విద్యా సంస్థల్లో పరీక్షలు జరుగుతుండటంతో విద్యార్థుల రద్దీ పెరిగింది. ఉచిత బస్సు పథకం కారణంగా మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా అధికమైంది. గురువారం సాయంత్రం బస్సు బయలుదేరుతున్న సమయంలో ఫుట్‌బోర్డుపై విద్యార్థులు గాలిలో వేలాడుతూ ప్రయాణించారు. ఏ మాత్రం పట్టు తప్పినా బ్రేక్ వేసినా పెను ప్రమాదం సంభవించేలా ఈ దృశ్యం కనిపించింది.
