నర్సాపూర్ (ప్రజాజ్యోతి) ఆర్టీసీ బస్సు డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ఓ ద్విచక్ర వాహనదారుడికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. నర్సాపూర్ పరిధిలోని చిన్నచింతకుంట సమీపంలో ఈ ఘటన వెలుగు చూసింది. నర్సాపూర్ వైపు ఒక వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో మెదక్ వైపు వెళ్తున్న ఓ కంపెనీ బస్సును ఓవర్ టేక్ చేస్తూ, ఆర్టీసీ బస్సు రాంగ్ రూట్ లోకి దూసుకువచ్చింది. ద్విచక్ర వాహనదారుడు అప్రమత్తమై 5 సెకన్ల పాటు బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ను నిలదీయగా, డ్రైవర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాడు. తప్పును ఒప్పుకోవాల్సింది పోయి.. “నువ్వే రాంగ్ రూట్ లో వచ్చావు” అంటూ దురుసుగా ప్రవర్తించాడు. ఆర్టీసీ డ్రైవర్ ఇలా నిర్లక్ష్యంగా వాహనాలు నడపడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సదరు డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
