సంక్రాంతి పండుగను స్వగ్రామాల్లో ఘనంగా జరుపుకునే రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) మొత్తం 8,432 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగువారి సౌకర్యార్థం ఈ బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలకు 2,432 ప్రత్యేక బస్సులు నడపనుండగా, మిగిలిన బస్సులను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు నడపనున్నట్లు వెల్లడించింది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, ఈ ప్రత్యేక బస్సుల్లో కూడా సాధారణ ఛార్జీలనే వసూలు చేయనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ స్పష్టం చేసింది.
తెలుగువారి అతి పెద్ద పండుగ సంక్రాంతి. తెలుగు రాష్ట్రాల్లో పండుగను మూడు రోజుల పాటు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ఘనంగా జరుపుకుంటారు. గ్రామాలు, పట్టణాలు, నగరాలు పండుగ శోభతో ముస్తాబవుతాయి. వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ, వ్యాపారాలతో స్థిరపడిన తెలుగువారు ఈ పండుగకు ప్రత్యేకంగా స్వగ్రామాలకు తరలివచ్చి కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. వీరి కోసమే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది.
