కరువు నేలల్లో సిరులు పండించి రైతుల జీవితాల్లో సంతోషాన్ని నింపిన గొప్ప పరిపాలకుడు కేసీఆర్.. అలాంటి కేసీఆర్ ను తిడుతున్న వారిని ఎన్నిసార్లు ఉరితీయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం తెలంగాణ భవన్ లో ‘నదీ జనాలు-కాంగ్రెస్ ద్రోహాలు’అంశంపై ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కేటీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట తప్పిన కాంగ్రెస్ ను ఎన్నిసార్లు ఉరితీయాలని కేటీఆర్ ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అని.. 420 హామీలు ఇచ్చి ఎగ్గొట్టినందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 420 సార్లు ఉరితీయాలని అన్నారు.
చెక్ డ్యాములను పేల్చేసే చెత్త ప్రభుత్వం
చరిత్రలో ఎన్నో చూశాం కానీ చెక్ డ్యామ్‌లను పేల్చేసే ఇలాంటి చెత్త ప్రభుత్వం ఇంకెక్కడా చూడలేమని కేటీఆర్ అన్నారు. నదీజలాలపై కాంగ్రెస్ దశాబ్దాలుగా చేస్తున్న ద్రోహాలకు కొన్ని వాస్తవాలు తెలంగాణ ప్రజల ముందు పెడుతున్నామని చెప్పారు. అవమానాలు భరించి ఆకలి బాధలు మాయం చేసిన మహానాయకుడు, తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన నాయకుడు, రైతుబంధు కేసీఆర్ ను రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
కూల్చివేతలు, పేల్చివేతలే..
సమైక్య వాదుల బూట్లు పాలిష్ చేసిన అల్పుడి చేతిలో తెలంగాణ ఉండటం బాధగా ఉందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి బేసిన్లు, బేసిక్స్ తెలవదని ఎద్దేవా చేశారు. వట్టెం, సుంకిశాలకు నష్టం జరిగితే బాగు చేయలేని అసమర్థ నాయకుడని విమర్శించారు. పేల్చివేతలు, కూల్చివేతలు, ఎగవేతలు తప్ప రాష్ట్రంలో ఏమీ జరుగడం లేదని కేటీఆర్ ఆరోపించారు.
