- ఆలయ కమిటీ సమావేశంలో వివాదం
- కులం పేరుతో దూషించారని ఫిర్యాదు.
నర్సాపూర్ (ప్రజాజ్యోతి) మండలంలోని పెద్దచింతకుంట గ్రామ సర్పంచ్ మరియు ఆయన వర్గీయులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను స్థానిక ఎస్సై రంజిత్ రెడ్డి శనివారం వెల్లడించారు. శుక్రవారం పెద్దచింతకుంట గ్రామంలోని జలహనుమాన్ ఆలయ కమిటీ ఏర్పాటు నిమిత్తం గ్రామస్తులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి గ్రామానికి చెందిన ధనుంజయ హాజరయ్యారు. ఈ క్రమంలో ధనుంజయకు, సర్పంచ్ వర్గీయులకు మధ్య మాటల యుద్ధం జరిగింది. సర్పంచ్ శివకుమార్, మల్లేశ్ గౌడ్, రాములు, విఠల్, మహేందర్ తదితరులు తనను కులం పేరుతో దూషించారని, అంతటితో ఆగకుండా ఆలయానికి రావద్దంటూ హెచ్చరించారని బాధితుడు ధనుంజయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు.. గ్రామ సర్పంచ్ శివకుమార్ సహా ఐదుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
