రాష్ట్రంలో కొత్త వాహనాల కొనుగోలుపై అదనపు భారం పడనుంది. రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా ప్రభుత్వం ‘రహదారి భద్రతా సెస్సు’ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.
నూతన నిబంధనల ప్రకారం, ఇకపై రిజిస్ట్రేషన్ అయ్యే ప్రతి కొత్త బైక్‌పై రూ. 2 వేలు, కారుపై రూ. 5 వేలు, భారీ వాహనాలపై రూ. 10 వేల చొప్పున సెస్సు వసూలు చేస్తారు. అయితే సామాన్యులకు ఊరటనిస్తూ ఆటోలు, ట్రాక్టర్ ట్రైలర్లకు ఈ పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. అలాగే సరుకు రవాణా వాహనాలకు ఇప్పటివరకు ఉన్న త్రైమాసిక పన్నును రద్దు చేస్తూ, దాని స్థానంలో 7.5 శాతం జీవితకాల పన్నును (లైఫ్ ట్యాక్స్) అమలు చేయాలని నిర్ణయించారు.
ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే పాత వాహనాలపైనా వాటి వయసును బట్టి 4 శాతం నుంచి 6.5 శాతం వరకు పన్ను వసూలు చేయనున్నారు. రోడ్డు భద్రతను మెరుగుపరచడంలో భాగంగా లైసెన్స్ జారీ ప్రక్రియను కూడా కఠినతరం చేస్తున్నామని, కంప్యూటర్ ఆధారిత డ్రైవింగ్ పరీక్షలను ప్రవేశపెడుతున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఏటా సుమారు 9 లక్షల కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్న నేపథ్యంలో, ఈ కొత్త సెస్సు ద్వారా ప్రభుత్వానికి రూ. 300 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరనుంది.
