- డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సిద్ధిరాం సింగ్
- వెంకట్రావుపేట సెక్షన్ ఆఫీసర్ కరీమొద్దీన్
నర్సాపూర్/శివ్వంపేట (ప్రజాజ్యోతి) అటవీ భూములను ఎవరైనా ఆక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సిద్ధిరాం సింగ్, వెంకట్రావుపేట సెక్షన్ ఆఫీసర్ కరీమోద్దీన్ హెచ్చరించారు. మండలంలోని రూపాతాండా పరిధిలో అక్రమంగా అటవీ భూమిని సాగు చేస్తున్న ప్రాంతాన్ని బుధవారం అటవీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారుల కథనం ప్రకారం.. రూపాతాండాకు చెందిన బానవత్ లక్ష్మి, బిక్షపతిలకు గతంలో ప్రభుత్వం అటవీ హక్కుల పత్రాల ద్వారా రెండు ఎకరాల భూమిని కేటాయించింది. అయితే, ఆ భూమిని సాగు చేసుకుంటూనే, అదే పట్టాను సాగుగా చూపిస్తూ వెంకటాపూర్ బీట్ కంపార్ట్మెంట్ 53లో మరో రెండు ఎకరాల అటవీ భూమిని అక్రమంగా దున్నకం చేపట్టారు. గత నెల 27న ట్రాక్టర్ సహాయంతో అటవీ భూమిని దున్నుతుండగా అటవీ అధికారులు అడ్డుకున్నారు.
అధికారుల విధులకు ఆటంకం – పోలీసులకు ఫిర్యాదు
అక్రమ సాగును అడ్డుకోవడానికి వెళ్లిన అటవీ అధికారుల విధులకు సదరు వ్యక్తులు భంగం కలిగించారని సెక్షన్ ఆఫీసర్ కరీమోద్దీన్ తెలిపారు. దీనిపై ఇప్పటికే శివ్వంపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. గతంలో కూడా అటవీ భూమిని ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టినందుకు బిక్షపతి, పురుషోత్తంలపై అటవీ చట్టం ప్రకారం కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. అటవీ అధికారులపై బిక్షపతి కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి పరిశీలనలో వారి వెంట ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు శ్రీధర్ కుమార్, రాజమణి, బీట్ ఆఫీసర్లు మౌనిక, శిరీష బాయి, వాచర్ భాను తదితరులు పాల్గొన్నారు.
