అనంతగిరి అటవీ పరిధిలో న్యూ ఇయర్ పేరుతో నిబంధనలకు నీళ్లు
– డీజేలు – ప్లాంట్ లైట్లు – ఇల్లిగల్ మద్యం
– వన్యప్రాణుల భద్రతకే ముప్పుగా మారిన రిసార్ట్స్ వేడుకలు
వికారాబాద్ ప్రతినిధి, డిసెంబర్ 31(ప్రజా జ్యోతి):
వికారాబాద్ జిల్లాలో న్యూ ఇయర్ వేడుకలు నిబంధనలకు అతీతంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అనంతగిరి అటవీ పరిధి చుట్టుపక్కల ఉన్న రిసార్ట్స్‌లో డీజే శబ్దాలతో పాటు భారీ ప్లాంట్ లైట్ల వెలుగులు రాత్రంతా వెలిగిపోతుండటం తీవ్ర వివాదాస్పదంగా మారింది. రిసార్ట్స్‌లో డీజేలకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు ప్రకటించినా, ఆ ఆదేశాలు కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోటిపల్లి, మోత్కుపల్లి, కేరెల్లి, సర్పంపల్లి, జైదుపల్లి, గొట్టిముక్కల రెవెన్యూ పరిధిలోని రిసార్ట్స్ అన్నీ న్యూ ఇయర్ పేరుతో యథేచ్ఛగా డీజేలు ఏర్పాటు చేసుకున్నాయి.
ప్లాంట్ లైట్లు – డీజే సౌండ్స్‌తో వన్యప్రాణులపై ప్రభావం:
అనంతగిరి అటవీ ప్రాంతం సున్నితమైన వన్యప్రాణుల నివాస ప్రాంతం. ఇలాంటి ప్రాంతాల్లో రాత్రంతా భారీ శబ్దాలు, అత్యధిక వెలుగులు కలిగిన ప్లాంట్ లైట్లు వెలిగించడం వన్యప్రాణుల సహజ జీవన విధానాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డీజే సౌండ్స్ వల్ల జంతువులు భయాందోళనకు గురై అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చే ప్రమాదం ఉందని, ఇది గ్రామాల వైపు వన్యప్రాణుల చొరబాటుకు దారితీయవచ్చని పర్యావరణవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాంట్ లైట్ల వెలుగులు రాత్రిపూట జంతువుల దారితప్పే పరిస్థితిని సృష్టిస్తాయని చెబుతున్నారు.
ఈవెంట్ తరువాత అడవుల్లోకి పంపే యోచన..?
పోలీసుల తనిఖీలు తప్పించుకునే ప్రయత్నంలో ఈవెంట్ ముగిసిన తర్వాత వచ్చిన అతిథులను “సరదా కోసం” అనంతగిరి అటవీ ప్రాంతాల వైపు పంపే యోచనలో రిసార్ట్స్ యాజమాన్యం ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ముందుగానే టార్చ్ లైట్లు పంపిణీ చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఇల్లిగల్ మద్యం ఏరులై పారుతోందా..?
న్యూ ఇయర్ వేడుకల పేరుతో అనుమతులు లేకుండా ఇల్లిగల్ మద్యం విక్రయాలు జోరుగా జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇది యువత భద్రతతో పాటు అటవీ ప్రాంతంలో అప్రమత్తతను పూర్తిగా కోల్పోయే పరిస్థితిని తెచ్చిపెడుతోందని, వన్యప్రాణులు అటవీ ప్రాంతాన్ని వదిలి సమీప ప్రాంతాలకు పారిపోయే అవకాశం ఉంటుందని అంటున్నారు.
పోలీస్ ఆదేశాలపై ప్రశ్నలు
ఈ మొత్తం వ్యవహారంపై ప్రజల్లో ఒకే చర్చ నడుస్తోంది:
“పోలీస్ అధికారుల ఆదేశాలు కేవలం హెచ్చరికలకే పరిమితమా..? లేక నిబంధనలు ఉల్లంఘించిన రిసార్ట్స్‌పై నిజంగా చర్యలు తీసుకుంటారా..?”
ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, అటవీ శాఖ, పోలీస్ శాఖ సమన్వయంతో అనుమతులు లేని డీజేలు, ప్లాంట్ లైట్లు, ఇల్లిగల్ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే న్యూ ఇయర్ సంబరాలు అనంతగిరి అటవీ ప్రాంతానికి దీర్ఘకాలిక నష్టాన్ని మిగిల్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
