- కార్ టైర్ పేలి పెను ప్రమాదం
- ఇద్దరు మృతి, ఇద్దరికీ గాయాలు
నర్సాపూర్ (ప్రజాజ్యోతి) విహారయాత్ర కోసం గోవా వెళ్లిన మెదక్ జిల్లా నర్సాపూర్ యువకుల బృందాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. మహారాష్ట్రలోని షోలాపూర్ సమీపంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నర్సాపూర్ పట్టణానికి చెందిన 15 మంది యువకులు కలిసి మూడు కార్లలో గోవా యాత్రకు వెళ్లారు. అక్కడ టూర్ ముగించుకుని తిరిగి వస్తుండగా, వీరు ప్రయాణిస్తున్న మూడు కార్లలో ఒక కారు షోలాపూర్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రేహాన్, పవన్ కుమార్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన కమ్రుద్దీన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో యువకుడు అఫ్రాన్ కూడా గాయపడ్డాడు. సంతోషంగా యాత్రకు వెళ్లి వస్తారనుకున్న యువకులు విగతజీవులుగా మారారన్న వార్త తెలియగానే నర్సాపూర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
