మేం వస్తే ఆ భూములు వెనక్కి తీసుకుంటాం: కేటీఆర్

V. Sai Krishna Reddy
1 Min Read

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల విలువైన 9,300 ఎకరాల పారిశ్రామిక భూములను అమ్మేస్తోందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మరోసారి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడుతోందని ఆయన విమర్శించారు.

కర్ణాటకలోని అత్తిబెలెలో ఇన్ఫోసిస్‌కు చెందిన విలువైన భూమిని పురవంకర సంస్థకు రూ.250 కోట్లకు అమ్మడంపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం చేసిన ఓ ట్వీట్‌పై కేటీఆర్ స్పందించారు. రాయితీపై పొందిన భూమిని నిర్దిష్ట ప్రయోజనానికి వాడనప్పుడు, దానిని వాణిజ్య ధరకు అమ్ముకునే హక్కు ఇన్ఫోసిస్‌కు లేదని, దాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని కార్తీ చిదంబరం పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. “తెలంగాణలోనూ అదే డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగాల కల్పన వంటి ప్రత్యేక ప్రయోజనాల కోసం రాయితీలపై ఇచ్చిన భూములను అమ్మి, బంధువులకు లబ్ధి చేకూర్చే హక్కు ప్రభుత్వానికి లేదు. ఆ భూములను ప్రభుత్వానికి అప్పగించి ప్రజల అవసరాలకు వాడాలి. పాఠశాలలు, ఆసుపత్రులు, పేదలకు ఇళ్లు, పార్కులు, బస్ స్టాండ్లు, పార్కింగ్ కోసం ఆ స్థలాలు అవసరం” అని కేటీఆర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కుంభకోణానికి తెరలేపిందని కేటీఆర్ ఆరోపించారు. మార్కెట్‌లో గజం లక్ష రూపాయలు పలికే భూమిని కేవలం రూ.4,000కే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న ఈ ‘సేల్ ఆఫర్’ చూసి మోసపోవద్దని రియల్ ఎస్టేట్ డెవలపర్లను హెచ్చరించిన కేటీఆర్, బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాగానే ఆ భూములను వెనక్కి తీసుకుంటుందని స్పష్టం చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *