హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలపై కఠిన ఆంక్షలు.. రాత్రి 1 గంటకే డెడ్‌లైన్

V. Sai Krishna Reddy
2 Min Read

హైదరాబాద్: 2026 నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసులు కఠినమైన మార్గదర్శకాలను జారీ చేశారు. డిసెంబర్ 31 రాత్రి జరిగే పార్టీలు, ఈవెంట్లు తప్పనిసరిగా రాత్రి 1 గంట కల్లా ముగించాలని స్పష్టం చేశారు. నగరంలో ‘జీరో డ్రగ్స్ పాలసీ’ని కఠినంగా అమలు చేయనున్నట్లు, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.

వేడుకల సందర్భంగా ప్రమాదాలను నివారించేందుకు, ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌ను అరికట్టేందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో విస్తృత తనిఖీలు చేపట్టనున్నారు. నగరవ్యాప్తంగా 120కి పైగా ప్రత్యేక చెక్‌పాయింట్లు ఏర్పాటు చేసి నిఘా పెంచారు. “మద్యం సేవించి వాహనం నడిపితే ఏమాత్రం ఉపేక్షించబోం. పట్టుబడిన వారి వాహనాలను సీజ్ చేయడంతో పాటు, రూ.10,000 జరిమానా, ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించబడుతుంది” అని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.

హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌ల యాజమాన్యాలకు పోలీసులు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేశారు. తమ ప్రాంగణాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల వినియోగం జరిగినా, అశ్లీల నృత్యాలకు అనుమతి ఇచ్చినా యాజమాన్యాలదే పూర్తి బాధ్యత అని తేల్చిచెప్పారు. “అలాంటి ఘటనలు జరిగితే, ఆ వేదికల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు, క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం” అని సజ్జనార్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాల్లోని డీజే సౌండ్ సిస్టమ్స్‌ను రాత్రి 10 గంటలకే నిలిపివేయాలని, ఇండోర్ ఈవెంట్లలో శబ్ద తీవ్రత 45 డెసిబెల్స్ మించరాదని ఆదేశించారు.

భద్రతా చర్యల్లో భాగంగా, డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు నగరంలోని ప్రధాన ఫ్లైఓవర్లు, ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)పై వాహనాల రాకపోకలను నిషేధించనున్నారు. అయితే, విమానాశ్రయానికి వెళ్లే వాహనాలకు మినహాయింపు ఇచ్చారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ వంటి ప్రాంతాల్లోనూ ఆంక్షలు అమలులో ఉంటాయి. వేడుకలు జరిగే ప్రాంతాల్లో భద్రత కోసం మఫ్టీలో షీ టీమ్స్ బృందాలను మోహరించనున్నారు. ప్రతి ఈవెంట్ వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లలో సీసీటీవీ రికార్డింగ్ తప్పనిసరి చేశారు.

మరోవైపు, డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నివారించేందుకు తెలంగాణ ఫోర్-వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ ముందుకు వచ్చింది. మద్యం సేవించిన వారిని సురక్షితంగా ఇళ్లకు చేర్చేందుకు 500 క్యాబ్‌లు, 250 బైక్‌లతో ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించింది

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *