నైజీరియా వాయవ్య ప్రాంతంలోని ఐసిస్ ఉగ్రవాద స్థావరాలపై అమెరికా సైనిక దాడిని నిర్వహించింది. దేశంలో పౌరులపై పెరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సమాధానంగానే ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. “ఈ రాత్రి కమాండర్ ఇన్ చీఫ్‌గా నా ఆదేశాల మేరకు నైజీరియా వాయవ్య ప్రాంతంలోని ఐసిస్ ఉగ్రవాదులపై శక్తివంతమైన, అత్యంత విధ్వంసకర దాడిని అమెరికా ప్రారంభించింది” అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఉగ్రవాద ముఠా ఏళ్ల తరబడి అమాయక క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని దారుణంగా హత్య చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను ఈ దాడికి ముందే ఉగ్రవాదులకు హెచ్చరికలు జారీ చేసినట్లు ట్రంప్ తెలిపారు. “క్రైస్తవుల హత్యలు ఆపకపోతే నరకం చూపిస్తామని నేను ఈ టెర్రరిస్టులను ముందే హెచ్చరించాను, ఈ రాత్రి ఆ హెచ్చరిక కార్యరూపం దాల్చింది” అని ఆయన అన్నారు. ఈ మిషన్‌లో అమెరికా దళాలు పలు ఆపరేషన్లను నిర్వహించినట్లు వివరించారు. “యుద్ధ విభాగం అనేక పక్కా దాడులను నిర్వహించింది, ఇది అమెరికా మాత్రమే చేయగలిగిన పని” అని పేర్కొన్న ట్రంప్.. కార్యాచరణ వివరాలను మాత్రం వెల్లడించలేదు. “నా నాయకత్వంలో, మన దేశం రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజం వృద్ధి చెందడానికి అనుమతించదు” అని ఆయన స్పష్టం చేశారు.
