- పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెర.. రేపే పోలింగ్.!
- మద్యం, నగదు పంపిణీపై యంత్రాంగం నిఘా
- 144 సెక్షన్ అమలు, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
మెదక్/నర్సాపూర్/కౌడిపల్లి (ప్రజాజ్యోతి) స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో గత కొన్ని రోజులుగా జోరుగా సాగిన ప్రచారానికి సోమవారంతో పూర్తిగా తెరపడింది. సర్పంచ్ పదవికి పోటీ పడుతున్న అభ్యర్థులు తమ అనుచరులు, మద్దతుదారులతో కలిసి మండలంలోని ఆయా గ్రామాలలో మూడో విడత ప్రచారాన్ని హోరెత్తించారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు చివరి నిమిషం వరకు నాయకులు అన్ని విధాలా ప్రయత్నించారు. రేపటి పోలింగ్ నమోదుకు ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ 144 సెక్షన్ అమలులో ఉంది. ఈ సందర్భంగా యంత్రంగం హెచ్చరికలు జారీ చేసింది. గ్రామాలలో అనవసరంగా గుమిగూడి సంభాషణలు, ఓటర్లను ప్రభావితం చేసేందుకు మద్యం , నగదు పంపిణీ, ఇతర ప్రలోభాలకు పాల్పడటం పూర్తిగా నిషేధించబడ్డాయి. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా మరియు మండల అధికారులు తీవ్రంగా హెచ్చరించారు. ముఖ్యంగా, పోలింగ్ రోజున ప్రశాంతతకు భంగం కలిగించే చర్యలను ఉపేక్షించేది లేదని యంత్రాంగం స్పష్టం చేశారు.
