- నమ్మిచ్చి ‘పెళ్లి చేసుకొని’ బంగారంతో పరారైన యువతి
- పర్వతగిరి స్టేషన్ లో నిత్య పెళ్లికూతురు పై కేసు నమోదు
పర్వతగిరి, నవంబర్ 24 (ప్రజాజ్యోతి):
మ్యారేజ్ బ్యూరో ద్వారా పరిచయమై.. నమ్మిచ్చి ‘పెళ్లి చేసుకొని’ బంగారంతో యువతి పరారైన సంఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పెళ్ళైన నెల రోజుల్లోనే ఒంటిమిద బంగారంతో యువతి ఉడాయించింది. దీంతో పెళ్లి కొడుకు మోస పోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.
పర్వతగిరి ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన మట్టపల్లి దేవేందర్రావు ఓ ప్రైవేటు ఉద్యోగి. పెళ్లి చేసుకుందామని మ్యారేజ్ బ్యూరో నడుపుతున్న కోడిపెల్లి అరుణ మరియు రామారావులను ఆశ్రాయించాడు. మ్యారేజ్ బ్యూరో ద్వారా నిమిషకవి ఇందిర (30) అనే అమ్మాయి పరిచయం అయ్యింది. అమ్మాయి నచ్చిందని మట్టపల్లి దేవేందర్రావు పెళ్లి ఖర్చులు భరిస్తూ 8.6 గ్రాముల బంగారం ఎదురు పెట్టి మమునూర్ గ్రామం వినయ్ గార్డెన్స్ లో 24.10.25 రోజు పెండ్లి చేసుకున్నారు.
పెళ్లి అనంతరం ఇందిరా ప్రవర్తనలో భర్తకు అనుమానం వచ్చింది. దీంతో భార్య ఇందిరాని ప్రశ్నించడంతో అసలు విషయం బయట పడింది. గతంలో పెళ్లి అయిందని 16 సంవత్సరాల కూతురు కూడా ఉందని తెలిపింది. భర్త జాగ్రత్త పడే అవకాశం ఇవ్వకుండా చెప్పా పెట్టక ఇంటి నుండి బంగారు ఆభరణాలతో సహా పారిపోయింది. బాధితుడు పర్వతగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

