- గ్రామ పంచాయతీ సిబ్బంది విధులను బహిష్కరణ
- ఆటో యూనియన్ సభ్యుల దురుసు ప్రవర్తనపై నిరసన
నెక్కొండ (ప్రజా జ్యోతి):
నెక్కొండ మండల కేంద్రంలో ప్రజల భద్రతకు ముప్పుగా మారిన ఓ చెట్టు తొలగింపు సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పనిలో ఉన్న గ్రామ పంచాయతీ సిబ్బందిపై స్థానిక ఆటో యూనియన్ సభ్యులు దురుసుగా, అనుచితంగా ప్రవర్తించినట్లు సిబ్బంది ఆరోపించారు. విధి నిర్వహణలో తమపై జరిగిన ఈ దాడిని ఖండిస్తూ, గ్రామ పంచాయతీ సిబ్బంది నిరసన నిర్ణయాన్ని ప్రకటించారు. నవంబర్ 22, 23 తేదీలలో తమ విధులను బహిష్కరిస్తున్నట్లు యూనియన్ తెలియజేసింది. తమకు న్యాయం జరిగే వరకు నిరసన విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. ఈ కారణంగా పట్టణ ప్రజలకు పారిశుద్ధ్యం, నీటి సరఫరా వంటి ప్రాథమిక సేవల్లో అంతరాయం కలుగుతుందని సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. అసౌకర్యానికి చింతిస్తూనే, తమ నిరసనకు సహకరించాలని, దురుసుగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని సిబ్బంది విజ్ఞప్తి చేశారు.
