ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిరి తాము ఇక్కడ అరెస్టులు చేయడం లేదని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని స్పష్టం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో ఇకపై కేసీఆర్ అనేది గతమని ఆయన అన్నారు. ఆయన శకం ముగిసిందని, భవిష్యత్తు అంతా కాంగ్రెస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 99 శాతం స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని, ఈ విషయం ప్రజలకు అర్థమైంది కాబట్టే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిందని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ ఆమోదం తెలిపిన విషయంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, తాము ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడబోమని స్పష్టం చేశారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ప్రతిపక్షమంతా ఎప్పుడో జైలులో ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. ఫార్ములా ఈ-కారు రేసు కేసులో రాజకీయ జోక్యం లేదని అన్నారు. చట్ట ప్రకారమే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రతిపక్షల నేతల విచారణలో తమ ప్రమేయం ఉండదని తేల్చి చెప్పారు.
