మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో ఆయన స్వగ్రామమైన ఛత్తీస్‌గఢ్‌లోని పువర్తిలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. దక్షిణ సుక్మా జిల్లాలోని ఈ మారుమూల గ్రామంలోని 50 ఇళ్లకు గాను సగానికి పైగా ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. గ్రామస్థులు దిగాలుగా కనిపించగా, హిడ్మా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. నడవలేని స్థితిలో ఉన్న హిడ్మా తల్లి మాంజు, ఇతర బంధువులు బోరున విలపిస్తున్నారు. బుధవారం రాత్రి వరకు మృతదేహం గ్రామానికి చేరుకోలేదు. సెల్‌ఫోన్‌లో ఫోటో చూసిన తర్వాతే మరణించింది హిడ్మానే అని పోలీసులకు ధ్రువీకరించినట్లు గ్రామస్థులు తెలిపారు. గురువారం మృతదేహం వస్తుందని ఎదురుచూస్తున్నారు.
కేవలం 50 ఇళ్లున్న ఈ చిన్న గ్రామం నుంచి హిడ్మా ఏకంగా 90 మంది యువకులను మావోయిస్టులుగా మార్చడం గమనార్హం. ఈ గ్రామానికి చెందిన మరో వాంటెడ్ మావోయిస్టు బార్స దేవా, హిడ్మా తర్వాత కీలక నేతగా ఉన్నాడు. మావోయిస్టుల పూర్తి నియంత్రణలో ఉన్న ఈ ప్రాంతంలో దశాబ్దాల తర్వాత ఏడాది కిందట సీఆర్‌పీఎఫ్ బేస్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పువర్తి పోలింగ్ బూత్ పరిధిలోని 547 ఓట్లకు గాను కేవలం 31 ఓట్లు పోలవగా, పువర్తి గ్రామం నుంచి ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు.
హిడ్మా తలపై ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ప్రకటించిన రివార్డు మొత్తం రూ.1.80 కోట్లుగా ఉంది. ఆయన మరణం నేపథ్యంలో అక్కడి పరిస్థితులను రిపోర్ట్ చేసేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి అటవీ మార్గంలో ప్రయాణించి పువర్తి గ్రామానికి చేరుకున్న ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి అక్కడి సాయుధ బలగాలు రకరకాల ప్రశ్నలు వేశారు.
