తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం.. ఈ సారి భక్తుల కోసం ప్రత్యేకంగా చేసిన ఏర్పాట్లు ఇవీ

V. Sai Krishna Reddy
1 Min Read

శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామి ఆలయం మండల పూజల కోసం తెరుచుకుంది. భక్తుల శరణుఘోషల మధ్య నిన్న సాయంత్రం 5 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచారు. నూతన మేల్‌శాంతిగా ఎంపికైన ప్రసాద్ నంబూద్రి, పవిత్ర పద్దెనిమిది మెట్లు ఎక్కి, సన్నిధానం తలుపులు తెరిచి తొలి పూజలు నిర్వహించారు. దీంతో మండలం రోజుల పాటు జరిగే అయ్యప్ప దీక్షల పూజా కార్యక్రమాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి.

మండల పూజల సీజన్ సందర్భంగా శబరిమలకు వచ్చే భక్తుల కోసం కేరళ ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పటిష్ఠమైన చర్యలు తీసుకుంది. పంపా బేస్ నుంచి సన్నిధానం వరకు ట్రెక్కింగ్ మార్గంలో పలుచోట్ల తాత్కాలిక వైద్య కేంద్రాలు, ఆక్సిజన్ సదుపాయాలను ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ల నుంచి పీజీ విద్యార్థుల వరకు వైద్య సిబ్బందిని 24 గంటలూ అందుబాటులో ఉంచారు.

శబరిమల చరిత్రలోనే తొలిసారిగా పంపా, సన్నిధానం వద్ద ఆపరేషన్ థియేటర్లను కూడా ప్రారంభించారు. పథనంతిట్ట జనరల్ ఆసుపత్రిలో అత్యవసర కార్డియాలజీ సేవలను సిద్ధం చేశారు. తెలుగు, తమిళం, కన్నడ సహా పలు భాషల్లో సూచిక బోర్డులను ఏర్పాటు చేసి, భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించేందుకు 04735 203232 హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రకటించారు.

యాత్రకు వచ్చే భక్తులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తమ వైద్య రికార్డులను వెంట తెచ్చుకోవాలని తెలిపింది. కొండ ఎక్కేటప్పుడు నెమ్మదిగా, విశ్రాంతి తీసుకుంటూ ప్రయాణించాలని, ఛాతీ నొప్పి లేదా శ్వాస ఇబ్బందులు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని స్పష్టం చేసింది. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని, పరిశుభ్రత పాటించాలని సూచించింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *