సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తండ్రి, దివంగత నటుడు కృష్ణను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న చిత్రం కోసం ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీలో ‘గ్లోబ్‌ట్రాటర్’ పేరుతో భారీ ఈవెంట్ జరగనుంది. ఈ ముఖ్యమైన రోజున తన తండ్రిని తలచుకుంటూ మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగభరిత పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా తన తండ్రితో దిగిన పాత ఫొటోను షేర్ చేస్తూ, “ఈరోజు మిమ్మల్ని నేను కాస్త ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నాను నాన్న… మీరు గర్వపడతారని నాకు తెలుసు నాన్న” అంటూ ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నారు. తన జీవితంలోని కీలక ఘట్టంలో తండ్రి తోడుగా లేరన్న ఆవేదన ఆయన మాటల్లో కనిపించింది.
ప్రస్తుతం మహేశ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తండ్రిపై ఆయనకున్న ప్రేమను చూసి అభిమానులు కూడా భావోద్వేగానికి లోనవుతున్నారు. కాగా, మహేశ్-రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఈవెంట్‌తో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
