ఢిల్లీ పేలుళ్ల కేసు: పగలు డాక్టర్.. సాయంత్రం 4 తర్వాత టెర్రరిస్ట్.. షహీన్ సయీద్ డబుల్ లైఫ్ బట్టబయలు

V. Sai Krishna Reddy
2 Min Read

ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ షహీన్ సయీద్ పగలు వైద్యురాలిగా పనిచేస్తూ, సాయంత్రం కాగానే ఉగ్రవాద కార్యకలాపాల్లో మునిగి తేలేదని విచారణలో తేలింది. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలకు ఫరీదాబాద్‌లోని అల్-ఫలా మెడికల్ సైన్సెస్ కాలేజీలో తన ఉద్యోగం ముగిశాకే, తన ‘అసలు పని’ మొదలవుతుందని షహీన్ తరచూ చెప్పేదని దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి.

ఎన్డీటీవీ కథనం ప్రకారం, షహీన్ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉండేదని ఆమె సహోద్యోగి ఒకరు తెలిపారు. ఆమె ఎప్పుడూ తన వెంట ప్రార్థనలకు ఉపయోగించే తస్బీహ్ (జపమాల), హదీస్ పుస్తకాన్ని ఉంచుకునేదని, సంస్థ నిబంధనలను పాటించకుండా ఎవరికీ చెప్పకుండానే తరచూ బయటకు వెళ్లిపోయేదని పేర్కొన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో సదరు విద్యాసంస్థ, షహీన్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది.

పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థ మహిళా విభాగానికి షహీన్ హెడ్‌గా పనిచేస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. లక్నో నివాసి అయిన షహీన్‌ను సోమవారం అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే, ఉమర్ మహమ్మద్ అనే మరో ఉగ్రవాది ఎర్రకోట వద్ద పేలుడు పదార్థాలతో నింపిన హ్యుందాయ్ ఐ20 కారుతో ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. గతంలో షహీన్ కాన్పూర్ మెడికల్ కాలేజీ, కన్నౌజ్ మెడికల్ కాలేజీలలో ఫార్మాకాలజీ విభాగాధిపతిగా కూడా పనిచేసింది.

ఈ కేసులో షహీన్‌కు ముందే డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ ఆదిల్ అహ్మద్‌లను అరెస్ట్ చేయడం ‘వైట్ కాలర్ టెర్రరిజం’ కోణాన్ని తెరపైకి తెచ్చింది. ఉగ్రకుట్రకు ఉపయోగించిన రెండు కార్లను షహీన్ పేరు మీదే గుర్తించారు. అసాల్ట్ రైఫిల్, బుల్లెట్లు లభించిన మారుతీ స్విఫ్ట్ డిజైర్ కారును షకీల్ వాడగా, బాంబు డెలివరీ కోసం సిద్ధం చేసిన మారుతీ బ్రెజాను షహీన్ స్వయంగా నడిపేదని అధికారులు తెలిపారు.

దేశ రాజధాని సహా పలు ప్రాంతాల్లో వరుస పేలుళ్లకు ఈ ముఠా భారీ ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా 32 కార్లను సిద్ధం చేసినట్లు సమాచారం. బుధవారం మరో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాల రవాణాకు దీన్ని వాడినట్లు ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలింది. ఈ కుట్ర వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు సంస్థలు విచారణను ముమ్మరం చేశాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *