జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది. గత కొన్ని రోజులుగా హోరాహోరీగా సాగిన ప్రచార పర్వం ఆదివారం సాయంత్రంతో ముగిసింది. ఎల్లుండి (నవంబరు 11, మంగళవారం) పోలింగ్ జరగనుండగా, ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ ఉప ఎన్నికలో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరితో పాటు మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల నేతలంతా చివరి రోజు వరకు విస్తృతంగా ప్రచారం నిర్వహించి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం 407 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా 139 సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు.
నవంబరు 11న పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం, ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాన్ని వెల్లడిస్తారు. దీంతో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది.
