యూత్ ఐకాన్ సిద్దు జొన్నలగడ్డ, రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’. దీపావళి కానుకగా అక్టోబరులో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 14వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమైన సంగతి తెలిసిందే. థియేటర్లలో ఈ సినిమాను చూడలేకపోయిన ప్రేక్షకులు ఓటీటీ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముక్కోణపు ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. అనాథ అయిన వరుణ్ (సిద్ధు జొన్నలగడ్డ) తనకు ఓ మంచి కుటుంబాన్ని ఏర్పరుచుకోవాలని కలలు కంటాడు. ఈ క్రమంలో కాలేజీలో రాగ (శ్రీనిధి శెట్టి)తో ప్రేమలో పడతాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె అతనికి దూరమవుతుంది. ఆ తర్వాత అంజలి (రాశీఖన్నా)ను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. సంతోషంగా సాగిపోతున్న వారి వైవాహిక జీవితంలో ఓ ఊహించని సమస్య ఎదురవుతుంది. అదే సమయంలో వరుణ్ జీవితంలోకి రాగ తిరిగి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? రాగ అసలు వరుణ్‌ను ఎందుకు వదిలి వెళ్లింది? ఈ ముగ్గురి మధ్య బంధం ఎలాంటి సంఘర్షణకు దారితీసిందనేదే ఈ చిత్ర కథ.
