బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి కేటీఆరే కారణమని, ఈ మాట గోపీనాథ్ తల్లే స్వయంగా చెప్పారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, కేటీఆర్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే అసలు నిజాలు బయటపడతాయని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా గత రాత్రి బోరబండలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్‌లతో పాటు సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టారు. “కేసీఆర్ మూర్ఖుడైతే, ఆయన కుమారుడు అంతకంటే పెద్ద మూర్ఖుడు. కేసీఆర్ మళ్లీ సీఎం కావడం కేటీఆర్‌కు ఇష్టం లేదు. ఎప్పుడెప్పుడు సీఎం గద్దెనెక్కాలా అని ఆయన చూస్తున్నారు. పదవి కోసం ఎంతకైనా తెగిస్తారు” అని ఆరోపించారు. కూతుళ్లే తల్లిదండ్రులను బాగా చూసుకుంటారని, తండ్రి బాగోగులు చూసుకోవాలని కవితకు సూచించారు.
అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. “రాష్ట్రంలో ఏనుగులు తినేటోడు పోయి, పీనుగలు పీక్కుతినేటోడు వచ్చిండు” అంటూ రేవంత్ పాలనపై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ కేవలం రూ.9 వేల కోట్లపైనే సీబీఐ విచారణ ఎందుకు కోరారని ప్రశ్నించారు. లక్ష కోట్ల అవినీతిపై విచారణ కోరే దమ్ము రేవంత్‌కు ఉందా? అని నిలదీశారు. రేవంత్, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటేనని, కలిసి లక్షల కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు.
మజ్లిస్‌పై కూడా బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. “జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలిస్తే అది మజ్లిస్ గెలిచినట్టే. వాళ్లు గెలిస్తే ప్రజలు బిచ్చగాళ్లు అవుతారు. మహిళల మెడలోని మంగళసూత్రాలు కూడా గుంజుకుపోతారు” అని హెచ్చరించారు. రేవంత్ టోపీ పెట్టుకోవడంపై స్పందిస్తూ, తనకు సినీనటుడు వేణుమాధవ్ గుర్తుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. “నేను హిందువును. తల నరుక్కుంటానే తప్ప టోపీ పెట్టుకొని దొంగ నమాజ్‌లు చేయను. ఇతర మతాలను కించపరచను” అని స్పష్టం చేశారు. చార్మినార్‌పై కాషాయ జెండా ఎగరవేయడమే తన లక్ష్యమని పునరుద్ఘాటించారు.
కాగా, బండి సంజయ్ రోడ్ షోకు తొలుత అనుమతి రద్దయిందని ప్రచారం జరిగింది. దీనిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో, పోలీసులు చివరికి ర్యాలీకి అనుమతినిచ్చారు. దీంతో ప్రచారం ప్రశాంతంగా ముగిసింది.
