ఈ మధ్య కాలంలో అతీంద్రియ శక్తులకు సంబంధించిన కథలు తెరపైకి వస్తున్నాయి. కథ ఏదైనా అది ఎక్కడో ఒక చోట దైవశక్తితో .. దుష్టశక్తితో ముడిపడి కనిపిస్తోంది. ప్రస్తుత కాలంలో జరిగే ఈ కథలకు, పురాణ సంబంధమైన సంఘటనలు తోడవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెరపై చోటుచేసుకునే వీఎఫ్ ఎక్స్ ను ఆడియన్స్ ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ తరహా కంటెంట్ తోనే ఇప్పుడు చాలా ప్రాజెక్టులు సెట్స్ పై ఉన్నాయి. వాటిలో ఒకటైన ‘జటాధర’ రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
సుధీర్ బాబు హీరోగా రూపొందిన ఈ సినిమాకి. వెంకటేశ్ కల్యాణ్ – అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. టైటిల్ తోనే అందరిలో ఆసక్తిని రేకెత్తించిన సినిమా ఇది. అలాగే సుధీర్ బాబు లుక్ కూడా మంచి మార్కులను కొట్టేసింది. ఈ నేపథ్యంలో వదిలిన టైటిల్ .. కంటెంట్ పై కుతూహలాన్ని పెంచింది. ఇక చాలాకాలం తరువాత శిల్పా శిరోద్కర్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను చేయడం, ధన పిశాచిగా సోనాక్షి సిన్హా కనిపించడం ప్రత్యేకతను సంతరించుకుంది.
లంకెల బిందెలు .. వాటికి కాపలాగా ధనపిశాచి ఉండటం, ఆ ధనం జోలికి అది ఎవరినీ రానీయకపోవడం వంటి జానపద కథలు మనం చిన్నప్పుడు చదువుకున్నాం. అలాంటి ఒక జానపద కథకి పురాణ సంబంధమైన నేపథ్యాన్ని జోడించి అల్లుకున్న కథ ఇది. అటు దుష్టశక్తికి .. ఇటు దైవశక్తికి మధ్య కథానాయకుడి సాహసాలు హైలైట్ గా నిలవనున్నాయి. ఈ సినిమాతో సుధీర్ బాబు హిట్ కొడతాడేమో చూడాలి మరి.
