హైదరాబాద్‌లోని బోరబండలో ఈరోజు జరగాల్సిన కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సభకు పోలీసులు అనుమతిని రద్దు చేశారు. తొలుత సభకు అంగీకారం తెలిపి, చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడంపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామంతో బోరబండలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఈ విషయంపై బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జి ధర్మారావు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ఒకసారి అనుమతి మంజూరు చేశాక, మళ్లీ రద్దు చేయడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. పోలీసుల తీరు ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉందని మండిపడ్డారు.
ఏదేమైనా, అనుకున్న ప్రకారం సాయంత్రం బోరబండలో సభ నిర్వహించి తీరుతామని ధర్మారావు స్పష్టం చేశారు. ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో సభకు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించి, బండి సంజయ్ సభకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని కోరారు. సభకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనని ఆయన గుర్తుచేశారు.
