- ఏసీబీ వలలో మరిపెడ ఏఈఓ
- రైతు బీమా కోసం లంచం తీసుకుంటూ..
మరిపెడ, నవంబర్ 6 (ప్రజా జ్యోతి)::
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో గురువారం ఆకస్మికంగా జరిగిన ఏసీబీ రైడ్ ఆపరేషన్‌లో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (ఏఈఓ) గాడిపెళ్లి సందీప్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వివరాల ప్రకారం.. మరిపెడ మండలంలోని అనేపురం గ్రామానికి చెందిన రైతు బిక్కు (మరణించిన) కుటుంబం ప్రభుత్వం అందించే రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకున్నారు. రైతు కుమారుడు గత నెల 30న అవసరమైన పత్రాలతో మరిపెడ వ్యవసాయ కార్యాలయానికి వెళ్ళగా, సదరు ఏఈఓ బీమా పత్రాలు ఆన్లైన్ చేయడానికి రూ.20 వేల లంచం డిమాండ్ చేశాడు. అధికారిపై విసుగుచెందిన దరఖాస్తుదారుడు నేరుగా వరంగల్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. అధికారులు పన్నిన ఉచ్చులో గురువారం ఏఈఓ చిక్కాడు. మరిపెడ మండల కేంద్రంలోని జేజే బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా రూ.10 వేలు లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ సిబ్బంది అతడిని పట్టుకున్నారు. అధికారిని శుక్రవారం ఉదయం వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపరచి రిమాండ్ చేయనున్నట్లు డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ఈ దాడిలో ఇన్స్పెక్టర్లు ఎల్.రాజు, శేఖర్ తదితర ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం మరిపెడలోని నిందితుడి బంధువుల నివాసాలపై కూడా అధికారులు సోదా చర్యలు చేపట్టారు.
