గూడెప్పాడు నుండి జాతీయ రహదారి పై భారీ వాహనాల దారి మళ్లింపు
- మల్లంపల్లి వాగు వంతెన వద్ద ట్రాఫిక్ మళ్లింపు — పోలీస్ రక్షణ చర్యలు చేపట్టాలని ఆర్ అండ్ బీ శాఖ విజ్ఞప్తి
ఆత్మకూరు, నవంబర్ 4 (ప్రజాజ్యోతి):
ములుగు జిల్లా మల్లంపల్లి మండలం జాతీయ రహదారి పై గల వాగు వంతెన వద్ద కాంక్రీట్ పనులు జరుగుతున్న సందర్బంగా ఐదు రోజులు ట్రాఫిక్ మళ్లింపుకు సహకరించాలని ఆర్ అండ్ బి అధికారులు పోలీస్ వారికి రక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
వరంగల్ నేషనల్ హైవే డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ కె.మనోహర్ (ఆర్ అండ్ బీ) పోలీస్ శాఖకు లేఖ రాసి మల్లంపల్లి వాగు వంతెన వద్ద రహదారి విస్తరణ పనుల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం, పాత ఎన్ హెచ్ -202 రహదారి (కిమీ 150.0 నుండి 159.0 మరియు కిమీ 165.4 నుండి 186.0 వరకు)ను నాలుగు లైన్లుగా విస్తరించడంలో భాగంగా మల్లంపల్లి వాగు వద్ద (కిమీ 176+716) మైనర్ వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను వృద్ధి ఇన్‌ఫ్రాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తోంది.
రాబోయే నవంబర్ 5 ఉదయం నుండి వంతెన వద్ద కాంక్రీట్ పనులు ప్రారంభమవుతాయని, ఆ సందర్భంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, భారీ వాహనాలు, లారీలను గూడెప్పాడు , పరకాల, రేగొండ, గంధినగర్, జంగాలపల్లి మార్గాల ద్వారా మళ్లించాలని సూచించారు.
కేవలం తేలికపాటి వాహనాలు (లైట్ మోటార్ వెహికల్స్) మాత్రమే ఒక లైన్ ద్వారా అనుమతించబడతాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రాఫిక్ నియంత్రణకు తగిన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆత్మకూరు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను కోరారు.
