ఇంజనీరింగ్ వైఫల్యం: రైతుల ఉసురు తీస్తున్న గుండ్రపల్లి అండర్ బ్రిడ్జి! రైల్వే, అధికారుల నిర్లక్ష్యంపై నిప్పులు చెరుగుతున్న అన్నదాతలు
నెక్కొండ::
నెక్కొండ మండలం గుండ్రపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి సమస్య శాశ్వత పరిష్కారం లేక, స్థానిక రైతుల జీవితాలను దుర్భరం చేస్తోంది. సాంకేతిక లోపాలతో నిర్మించిన ఈ బ్రిడ్జి కింద ఎప్పుడూ నీరు నిలిచి ఉండటంతో వ్యవసాయ పనులు పూర్తిగా స్తంభించాయి. ఇది కేవలం ట్రాఫిక్ సమస్య కాదు, రైతుల ఉపాధిని దెబ్బతీస్తున్న ఇంజనీరింగ్, కాంట్రాక్టర్ వైఫల్యమని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యపై నలుగురు రైతుల ఆవేదన వారి మాటల్లోనే:
- రమణారెడ్డి రైతు*
“మాకు పొలం బ్రిడ్జి పక్కనే ఉన్నా, నీళ్ల వల్ల 10 కిలోమీటర్లు చుట్టూ తిరిగి పోవాల్సి వస్తోంది. సమయంతో పాటు, డీజిల్ ఖర్చు రెట్టింపై అప్పుల పాలవుతున్నాం. కాంట్రాక్టర్ ఫెయిల్యూర్ వల్ల మేమెందుకు నష్టపోవాలి?”
- శ్రీధర్ రైతు*
“నీటిని బయటికి తోడడానికి వేసిన మోటార్ కూడా నడపడం లేరు.ఒక్క మోటార్ కాదు ఎక్కువ మోటార్లు పెట్టాలి. లక్షలు పెట్టి బ్రిడ్జి కట్టినప్పుడు, డ్రైనేజీ వ్యవస్థ ఎందుకు సరిగ్గా వేయలేదు? ఇది ఇంజనీర్ల వైఫల్యం కాక మరేమిటి? అధికారులు వచ్చి చూసి పోవడం తప్ప ఏమీ చేయట్లేదు.”
- బైరు ఎల్లయ్య (రైతు)*
“నా కళ్లెదుటే నా ఎద్దు నిలిచిన నీటిని దాటలేక, కుప్పకూలి మృతి చెందింది! ఈ నష్టానికి ఎవరు బాధ్యులు? నా ఎద్దు ప్రాణాన్ని కూడా కాపాడలేని ఈ బ్రిడ్జి మాకెందుకు? దీనికి అధికారులు జవాబు చెప్పాలి.”
- రామారావు రైతు (బిజెపి నాయకులు)*
పంట చేతికొచ్చే సమయానికి కూడా పొలంలోకి వెళ్లలేని పరిస్థితి. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మాకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. తక్షణమే రైల్వే ఉన్నతాధికారులు మరియు స్థానిక ప్రభుత్వం స్పందించి, శాశ్వత పరిష్కారం చూపాలి. లేకపోతే, మేం అందరం కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం.
- తక్షణ పరిష్కారం కోరుతున్న రైతులు*
నిలిచిన నీరు రైతుల జీవితాలను, జీవనోపాధిని తీవ్రంగా దెబ్బతీస్తోంది. బైరు ఎల్లయ్యకు చెందిన ఎద్దు మృతి ఘటన, ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి నిదర్శనం. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అధికారులు, కాంట్రాక్టర్ల నాసిరకం పనిని ఎందుకు ప్రశ్నించడం లేదని రైతులు నిలదీస్తున్నారు.
- గుండ్రపల్లి రైతులు డిమాండ్ చేస్తున్నది ఒక్కటే*
నాణ్యతలేని పనికి బాధ్యులను గుర్తించి, తక్షణమే శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఈ సమస్యపై ప్రభుత్వ, రైల్వే ఉన్నతాధికారుల జోక్యం అత్యవసరం.
