- సమ్మయ్య నగర్ ప్రభుత్వ పాఠశాలలు వరద ముప్పులో
- నీటిలో మునిగిన పుస్తకాలను ఎండలో ఆరబెడుతున్న ఉపాధ్యాయులు
వరంగల్, నవంబర్ 3 (ప్రజాజ్యోతి):
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా హనుమకొండ జిల్లా సమ్మయ్యనగర్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వరద నీరు పాఠశాల ఆవరణలోకి చేరి తరగతి గదులు పూర్తిగా మునిగిపోయాయి. నీటిలో తడిసిపోయిన పాఠ్య పుస్తకాలు, రికార్డులు, ఫర్నిచర్ దెబ్బతిన్నాయి.
స్థితిని గమనించిన ఉపాధ్యాయులు పాఠశాల శుభ్రపరిచే పనుల్లో నిమగ్నమై, నీటిలో తడిసిన పుస్తకాలను ఆరుబయట ఎండలో ఆరబెట్టారు. విద్యార్థుల కోసం పాఠశాలను తిరిగి సిద్దం చేసేందుకు సిబ్బంది కృషి చేస్తున్నారు. స్థానిక ప్రజలు, తల్లిదండ్రులు కూడా శుభ్రత కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు.
పాఠశాల విద్యా విభాగ అధికారులు పరిస్థితిని పరిశీలించి, అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
పాఠశాల కాంపౌండ్ వాల్ గేట్ పిల్లర్ కూలిపోవటంతో గేట్ పూర్తిగా ధ్వంసం అయ్యింది. వరద తాకిడికి స్కూల్ వాష్ రూమ్స్ ప్రభుత్వ పాఠశాల తీవ్రంగా దెబ్బతింది. వరద నీరు పాఠశాల భవనం చుట్టూ ఉద్ధృతంగా ప్రవహించి వాష్‌రూమ్ నిర్మాణాలను కూడా కొట్టుకుపోయింది. ఫలితంగా విద్యార్థులు, ముఖ్యంగా చిన్నారులు, భారీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పాఠశాల ఆవరణలో ఇంకా నీటి మడుగులు ఉండడంతో తరగతులు పునఃప్రారంభం కష్టంగా మారింది. ఉపాధ్యాయులు, గ్రామస్థులు కలిసి శుభ్రత పనులు చేపడుతున్నప్పటికీ వాష్‌రూమ్‌లు పూర్తిగా ధ్వంసమైనందున తాత్కాలిక సదుపాయాల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
శానిటేషన్ సిబ్బందికి ఎన్నో సార్లు చెప్పిన స్పందన రావటం లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తరలి వచ్చి పాఠశాల ఆవరణ శుభ్రం చేయటంలో సహాయం చేస్తున్నారు.


