బంగారం ధరలు వరుసగా రెండో వారం కూడా తగ్గుముఖం పట్టాయి. డాలర్ విలువ బలపడటం, అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై సానుకూల సంకేతాలు వంటి అంశాలు పసిడి ధరల పతనానికి కారణమయ్యాయి. ఇటీవల తులం (10 గ్రాములు) 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,25,000 దాటి రికార్డు సృష్టించగా, ప్రస్తుతం అది రూ.1,23,000 వద్ద స్థిరపడింది.
అక్టోబర్ నెలలో ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరిన తర్వాత ఈ తగ్గుదల నమోదైంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం, ట్రంప్-జిన్‌పింగ్ చర్చలు సానుకూలంగా సాగడం, దేశంలో పండుగల సీజన్ ముగియడం వంటి పరిణామాలు స్వల్పకాలంలో బంగారంపై ప్రతికూల ప్రభావం చూపాయని పీఎల్ క్యాపిటల్ డైరెక్టర్ సందీప్ రైచురా విశ్లేషించారు. గ్లోబల్ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర గరిష్ట స్థాయి నుంచి 4,000 డాలర్ల స్థాయికి పడిపోయిందని వెల్త్ ట్రస్ట్ క్యాపిటల్ సర్వీసెస్ సీఈఓ స్నేహ జైన్ తెలిపారు. డిసెంబర్ నాటికి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. రెండు వారాల పాటు ఒడిదుడుకులకు లోనైన వెండి, ఇప్పుడు స్థిరత్వం దిశగా పయనిస్తోంది. అక్టోబర్‌లో కేజీ వెండి ధర రూ.2 లక్షలు దాటగా, ప్రస్తుతం రూ. 1.66 లక్షలకు తగ్గింది. ఈ ధర మరింత తగ్గే అవకాశం ఉందని స్నేహ జైన్ అభిప్రాయపడ్డారు. అయితే, భవిష్యత్తులో ధరల తగ్గుదల అనేది స్థూల ఆర్థిక డేటాపై ఆధారపడి ఉంటుందని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన వ్యాఖ్యలు లోహాల మార్కెట్‌ను ప్రభావితం చేశాయని వెంచురా కమోడిటీస్ హెడ్ ఎన్ఎస్ రామస్వామి పేర్కొన్నారు. అందువల్ల, పసిడి ధరలలో ఊహించని మార్పులు జరిగే ఆస్కారం ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండి బేస్ దిగుమతి ధరలను తగ్గించింది. బంగారం దిగుమతి ధరను 10 గ్రాములకు 42 డాలర్లు, వెండి దిగుమతి ధరను కేజీకి 107 డాలర్ల చొప్పున తగ్గించింది. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ మార్కెట్లో ధరలను స్థిరంగా ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
