- మరిపెడలో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి, నలుగురికి గాయాలు
మరిపెడ, నవంబర్ 1(ప్రజాజ్యోతి):
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బురహాన్‌పురం గ్రామ శివారులో జాతీయ రహదారి 365పై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. అతివేగం కారణంగా బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఈ దుర్ఘటన సంభవించినట్లు పోలీసులు తెలిపారు. సీరోల్ మండలం ఉప్పరిగూడెం మరియు మరిపెడ మండలం లచ్చ తండాకు చెందిన 25 మంది యువకులు సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే ఓ శుభ కార్యంలో క్యాటరింగ్ పనుల కోసం బొలెరో వాహనంలో బయలుదేరారు. ఉదయం మూలమలుపు వద్ద వాహనం అతివేగంతో ఉండటంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో సీరోల్ మండలం ఉప్పరిగూడెంకు చెందిన మాలోతు పవన్ (20) అనే యువకుడు మృతి చెందగా, మాలోతు సందీప్, బానోతు ఈశ్వర్, గుగులోతు కుమార్ మరియు మరిపెడ మండలం లచ్చ తండాకు చెందిన లక్ష్మణ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని వెంటనే 108 సేవల ద్వారా మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ పవన్ మృతి చెందినట్లు ఎస్సై వీరభద్రం తెలిపారు.
మృతుడు పవన్ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, అతని తండ్రి మానసిక దివ్యాంగుడని, కుటుంబ పోషణ కోసం పవన్ వ్యవసాయ కూలీగా పనిచేస్తూ, ఈ రోజు మిత్రులతో కలిసి క్యాటరింగ్ పనికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు బంధువులు వాపోయారు. ప్రమాదానికి అతివేగంతో పాటు, వాహనంలోని కొందరు మద్యం సేవించి ఉండవచ్చని మృతుడి బంధువులు ఆరోపించారు.
పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ప్రాంతంలో విషాద ఛాయలు అలముకుంది.

