బాలీవుడ్ సీనియర్ నటుడు, దిగ్గజ నటుల్లో ఒకరైన ధర్మేంద్ర ఆసుపత్రిలో చేరారన్న వార్త ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేసింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన్ను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నప్పటికీ, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి.
శుక్రవారం రాత్రి జర్నలిస్ట్ విక్కీ లాల్వానీ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించడంతో ధర్మేంద్ర ఆరోగ్యంపై చర్చ మొదలైంది. “శ్వాస సంబంధిత సమస్యతో ధర్మేంద్ర ఆసుపత్రికి వచ్చారు. ఆయన ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు” అని ఆసుపత్రి సిబ్బంది ఒకరు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరిస్తూ “ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. హృదయ స్పందన రేటు 70 కాగా, రక్తపోటు 140/80గా ఉంది. ఇతర పారామీటర్లు కూడా సాధారణంగానే ఉన్నాయి” అని సదరు సిబ్బంది స్పష్టం చేసినట్లు తెలిసింది.
అయితే, ధర్మేంద్ర ఆసుపత్రిలో చేరడంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఆయన సాధారణ ఆరోగ్య పరీక్షల కోసమే ఆసుపత్రికి వెళ్లారని, ఎవరో చూసి తప్పుడు ప్రచారం చేశారని ఒక మీడియా సంస్థ పేర్కొంది. మరోవైపు, ఆయన గత ఐదు రోజులుగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారని ఇంకో జాతీయ మీడియా సంస్థ కథనం ప్రచురించింది. దీంతో ఆయన ఆరోగ్యంపై కాస్త గందరగోళం నెలకొంది.
డిసెంబర్ 8న 90వ పడిలోకి అడుగుపెట్టనున్న ధర్మేంద్ర, ఈ ఏడాది ప్రారంభంలో కంటికి సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ సమయంలో కూడా ఆయన ఎంతో ధైర్యంగా మీడియాతో మాట్లాడుతూ “నేను చాలా బలంగా ఉన్నాను. నాలో ఇంకా చాలా దమ్ముంది” అని వ్యాఖ్యానించి అభిమానుల్లో స్ఫూర్తి నింపారు.
సినిమాల విషయానికొస్తే ధర్మేంద్ర ప్రస్తుతం శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇక్కిస్’ అనే బయోపిక్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 1971 ఇండో-పాక్ యుద్ధంలో వీరమరణం పొందిన సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద హీరోగా నటిస్తుండగా, ధర్మేంద్ర అతని తాత పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
