జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దీనిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అయితే, జూబ్లీహిల్స్ అనగానే అందరికీ గుర్తొచ్చే సినీ, రాజకీయ ప్రముఖులు, సంపన్నులు నివసించే ప్రాంతానికి ఈ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదన్నది ఆశ్చర్యపరిచే నిజం. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో అసలు జూబ్లీహిల్స్ ప్రాంతమే లేదు.
వాస్తవానికి ఈ నియోజకవర్గం పరిధిలో షేక్‌పేట, ఎర్రగడ్డ, బోరబండ, రహ్మత్‌నగర్, వెంగళరావునగర్, యూసుఫ్‌గూడ, సోమాజిగూడ అనే ఏడు డివిజన్లలోని ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి. జూబ్లీహిల్స్‌లో నివసించే ప్రముఖుల్లో చాలా మంది ఓట్లు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నాయి. దీంతో పేరులో ఉన్నంత వైభవం ఈ నియోజకవర్గంలో కనిపించదు. ఇక్కడ వీఐపీలు ఎవరూ లేరు. ఉన్నవారంతా సాధారణ, మధ్యతరగతి ప్రజలే.
దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో బస్తీలే అధికంగా ఉన్నాయి. విద్యావంతులు ఉన్నప్పటికీ వారంతా సామాన్య జీవితం గడిపేవారే. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఉపఎన్నిక బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు కొందరు స్వతంత్రులు మాత్రమే ఇక్కడ స్థానిక ఓటర్లుగా ఉన్నారు. ఒకరకంగా వారే ఈ నియోజకవర్గంలో ప్రముఖులుగా చెప్పుకోవచ్చు.
పరిపాలనా సౌలభ్యం విషయంలో కూడా ఈ నియోజకవర్గం వెనుకబడే ఉంది. ఇటీవల మధురానగర్, బోరబండ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసినప్పటికీ, నియోజకవర్గంలోని చాలా ప్రాంతాలు పంజాగుట్ట, బంజారాహిల్స్, సనత్‌నగర్, ఫిలింనగర్ వంటి ఇతర నియోజకవర్గాల పరిధిలోని పోలీస్ స్టేషన్లపై ఆధారపడి ఉన్నాయి. రెవెన్యూ సేవల కోసం కూడా ఖైరతాబాద్, షేక్‌పేట, అమీర్‌పేట మండల కార్యాలయాలకు వెళ్లాల్సిందే. పేరులో జూబ్లీహిల్స్ ఉన్నప్పటికీ, ఈ నియోజకవర్గం వాస్తవ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉండి, సామాన్యుల సమస్యలే ఇక్కడ ప్రధాన ఎన్నికల అంశాలుగా ఉన్నాయి.
