- వర్షాలతో తడిసిన పంటలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి
- మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్
వరంగల్ / ప్రజాజ్యోతి:
వర్షాలతో తడిసిన పంటలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర సీనియర్ నేత, నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర రైతాంగ సమస్యలపై తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి సహాయ చర్యలు చేపట్టకుండా వారిని నట్టేట ముంచే పరిస్థితిని సృష్టిస్తోందని ఆయన విమర్శించారు. రైతులు ఆరు నెలల పాటు కష్టపడి పండించిన పంటలు వర్షం కారణంగా మార్కెట్లలో నీళ్లపాలై, మొలకెత్తుతున్న దుస్థితి నెలకొన్నదని ఆయన తెలిపారు.రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనా, పూర్తిగా ఎండిన ధాన్యం వర్షానికి తడిసి నాశనమవుతున్నదని వ్యాఖ్యానించారు. మొక్కజొన్న కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఏ ఒక్కచోటా కొనుగోలు జరగలేదని తెలిపారు.తేమ శాతం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, తడిసిన మొక్కజొన్న, పత్తి, వరి ధాన్యాలను ప్రభుత్వం వెంటనే ప్రతి క్వింటాకు సరైన ధరతో కొనుగోలు చేయాలని పెద్ది సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
