కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని, జూబ్లీహిల్స్‌లో ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకే మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్‌లో ఓటమి భయం పట్టుకోవడం వల్లే కాంగ్రెస్ ఈ ఎత్తుగడ వేస్తోందని ఆమె విమర్శించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4 లక్షల ఓటర్లు ఉండగా, వారిలో లక్షకు పైగా ముస్లిం మైనారిటీ ఓటర్లు ఉన్నారని డీకే అరుణ తెలిపారు. ఈ ఓట్లను తమ వైపు తిప్పుకోవాలనే దురుద్దేశంతోనే కాంగ్రెస్ ఇప్పుడు అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వాలని చూస్తోందని ఆరోపించారు. మైనారిటీలు ఈ విషయాన్ని గ్రహించి కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు.
తెలంగాణలో కాంగ్రెస్ పాలన గాడితప్పిందని, ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని డీకే అరుణ దుయ్యబట్టారు. “ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓట్లు అడిగే హక్కు లేదు. దమ్ముంటే కాంగ్రెస్ నేతలు నాతో ప్రచారానికి రావాలి. వారి వైఫల్యాలను నేను నిరూపిస్తా” అని సవాల్ విసిరారు.
రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టేలా కాంగ్రెస్ పాలన సాగుతోందని, ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అందరూ దోచుకోవడం, పంచుకోవడంలోనే మునిగిపోయారని ఘాటు విమర్శలు చేశారు. మంత్రుల మధ్య పంపకాల పంచాయితీలు నడుస్తున్నాయని, ఈ విషయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. “ఇంకో మూడు నెలల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అంటున్నారు. దేవుళ్లపై ఒట్లు వేసి హామీలిచ్చి, ఇప్పుడు చేతులెత్తేశారు” అని ఎద్దేవా చేశారు.
ఇటీవల కొందరు జర్నలిస్టులు కొడంగల్ – వికారాబాద్ రైల్వే లైన్‌ను రాష్ట్ర ప్రభుత్వమే తెస్తున్నట్లు వార్తలు రాయడంపై ఆమె స్పందించారు. అది కృష్ణా – వికారాబాద్ రైల్వే లైన్ అని, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు అని స్పష్టం చేశారు. కేవలం భూసేకరణ చేసినంత మాత్రాన రాష్ట్ర ప్రభుత్వమే ఆ లైన్ తెచ్చినట్లు అవుతుందా? అని ఆమె ప్రశ్నించారు.
