ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మరోసారి హైదరాబాద్ సంగీత ప్రియులను తన స్వరాలతో అలరించనున్నారు. నవంబర్ 8న రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా ఆయన భారీ లైవ్ కాన్సర్ట్ నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ టాకీస్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఈ వార్తతో రెహమాన్ అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.
ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ, “హైదరాబాద్ అత్యంత డైనమిక్ నగరంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడి ప్రజలు లైవ్ కాన్సర్ట్‌లను ఎంతగానో ఆదరిస్తున్నారు. ఏఐ ప్రభావం పెరుగుతున్న ఈ రోజుల్లో కూడా ప్రేక్షకులు నిజమైన సంగీత అనుభూతి కోసం ఇలాంటి కార్యక్రమాలకు రావడం కళాకారులకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది” అని అన్నారు. ఇది సంగీతం పట్ల ప్రజలకు ఉన్న ప్రేమకు నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ టాకీస్ వ్యవస్థాపకుడు సాయినాథ్ గౌడ్ మాట్లాడుతూ, “ప్రేక్షకులకు ప్రపంచ స్థాయి సంగీత అనుభవాన్ని అందించడమే మా లక్ష్యం. ఈ ఏడాది ఆరంభంలో ఎం.ఎం. కీరవాణితో కార్యక్రమం నిర్వహించాం. ఇప్పుడు రెండోసారి ఏఆర్ రెహమాన్‌ను నగరానికి తీసుకురావడం గర్వంగా ఉంది. ఈ ఈవెంట్ కోసం దీపక్ చౌదరి, ఇవా లైవ్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం” అని తెలిపారు.
భారతీయ సంగీతాన్ని ప్రపంచ వేదికలపై వినిపించిన రెహమాన్, తన లైవ్ ప్రదర్శనలతో ఇప్పటికే ఎంతో మందిని మంత్రముగ్ధులను చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లో జరగబోయే ఈ సంగీత విభావరిలో ఆయన తన కెరీర్‌లోని ఎన్నో సూపర్ హిట్ గీతాలను ప్రత్యక్షంగా ఆలపించనున్నారు. దీంతో నవంబర్ 8న రామోజీ ఫిల్మ్ సిటీ రెహమాన్ స్వరాలతో మార్మోగడం ఖాయంగా కనిపిస్తోంది.
