కలిసి రండి.. సమన్వయం తో తుఫాన్ ఆపదను ఎదుర్కొందాం
– ఎమ్మెల్యే బి ఎల్ అర్
అన్ని శాఖల అధికారులు, మిల్లర్స్ తో సమావేశం ఏర్పాటు
మిర్యాలగూడ, అక్టోబర్ 30,( ప్రజాజ్యోతి ):
తుఫాన్ ఎఫెక్ట్ నివారణ కోసం అందరూ సమన్వయంతో పనిచేసి, సంబంధిత అధికారులతో సమస్యలకు తక్షణమే పరిష్కార మార్గం చేపట్టాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి( బి ఎల్ అర్ ) కోరారు.
శుక్రవారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు, రైస్ మిల్లర్స్ ప్రతినిధులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారుల తో మాట్లాడుతూ
మొంధా తుఫాన్ దాటికి దెబ్బతిన్న రోడ్లను ఆర్ అండ్ బి శాఖ అధికారులు గుర్తించి, తక్షణమే మరమ్మత్తులు చేయాలన్నారు.ముఖ్యంగా పంట చేతికి అంది వచ్చేవేళ తుఫాను రైతన్న ను తీవ్ర నిరాశకు, ఇబ్బందులకు గురిచేసిందని రైతుకు అండగా అధికారులంతా నిలవాలని కోరారు.పంట నష్టం అంచనావేసేందుకు వ్యవసాయ,రెవిన్యూ అధికారులు సంయుక్తంగా ప్రతీ గ్రామానికి వెళ్లి పంటపొలాలను పరీక్షించి సర్వేనిర్వహించి, నష్టం అంచనా వేసి,నివేదికలు అందజేయాలన్నారు.
విద్యుత్ సమస్యలను సంబంధిత అధికారులు గుర్తించి మరమ్మతులు చేసి వెంటనే పునరుద్ధరించాలని కోరారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
రైస్ మిల్లర్లు పెద్ద మనసుతో రైతు సంక్షేమం కోసం తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని వారిని కోరారు
మిల్లుల వద్ద రైతుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు నిరంతరం పర్యవేక్షించా లన్నారు.ఎంఈఓ లు ఉపాధ్యాయులతో అత్యవసరసమావేశం ఏర్పాటు చేయాలన్నారు.
గ్రామస్థాయిలో ఏ సమస్యలున్నా గుర్తించి సంబంధిత అధికారులకు తెలియచెప్పే బాధ్యతను ఉపాధ్యాయులు చేపట్టాలన్నారు.అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుందని అందులో అధికారులు గుర్తించిన సమస్యలను, చేపట్టిన చర్యలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని కోరారు.అకాల ఆపద సమయాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ ,పోలీస్ , అగ్రికల్చర్, మున్సిపాలిటీ, ఆర్ అండ్ బి అధికారులు, ఎంపీడీఓ లు,పంచాయతీ రాజ్, ఎలక్ట్రికల్ శాఖ అధికారులు, ఎంఈఓలు, మిల్లర్స్,ఇతర అధికారులు పాల్గొన్నారు.
