ఒకే రోజున రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి సిద్ధమయ్యాయి. ఒకటి రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటించిన ‘కాంతార చాప్టర్ -1’ అయితే, మరొకటి కల్యాణి ప్రియదర్శన్ ప్రధానమైన పాత్రను పోషించిన ‘లోకా -చాప్టర్ 1: చంద్ర’. ఒకటి 800 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టిన కన్నడ సినిమా అయితే, మరొకటి 300 కోట్లకి పైగా కొల్లగొట్టిన మలయాళ మూవీ. ఈ రెండు సినిమాలు ఈ నెల 31వ తేదీ నుంచి ఓటీటీ ప్రేక్షకులను పలకరించనున్నాయి.
‘కాంతార చాప్టర్ -1’ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు దక్కించుకున్నారు. ఈ నెల 31వ తేదీ నుంచి ఈ సినిమాను కన్నడతో పాటు, తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ‘కాంతార’ అడవులను ఆక్రమించడానికీ .. అక్కడి గిరిజనులను అణగదొక్కడానికి ఒకరాజు ప్రయత్నిస్తాడు. అడవినీ .. తనవారిని కాపాడుకోవడానికి ఆ నాయకుడు ఏం చేశాడు? అనేదే కథ. ఇప్పటికీ థియేటర్స్ లో ఆడుతున్న ఈసినిమా ఓటీటీ కి వస్తుండటం విశేషం.
ఇక ‘లోకా -చాప్టర్ 1: చంద్ర’ విషయానికి వస్తే, దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ సినిమాకి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో చంద్ర అనే పాత్రలో కల్యాణి ప్రియదర్శన్ నటించింది. అతీంద్రియ శక్తులను దాచిపెట్టి ఒక సామాన్య యువతిగా రోజులు గడుపుతూ ఉంటుంది. చంద్రపై మనసు పారేసుకున్న సన్నీ, ఆమెకి అతీంద్రియ శక్తులు ఉన్నాయని తెలుసుకుంటాడు. ఫలితంగా ఏం జరుగుతుందనేది కథ. ఇక ఇదే రోజున ‘జీ 5’లో ‘మారిగల్లు’ అనే కన్నడ సిరీస్ స్ట్రీమింగ్ కి రానుంది.
