మావోయిస్టు పార్టీకి తెలంగాణలో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. దశాబ్దాలుగా పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ నేత బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు.
దాదాపు 45 సంవత్సరాలుగా సీపీఐ (మావోయిస్టు) పార్టీలో బండి ప్రకాశ్ క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, నేషనల్ పార్క్ ఏరియాకు కీలక ఆర్గనైజర్‌గా ఆయన పలు ముఖ్య బాధ్యతలు నిర్వర్తించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ఆయన స్వస్థలం.
1982-84 మధ్యకాలంలో జరిగిన ‘గో టు ద విలేజెస్’ ఉద్యమంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్‌ఎస్‌యూ) తరఫున ఆయన పనిచేశారు. ఆ తర్వాత మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ అయిన సింగరేణి కార్మిక సంఘానికి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు.
ఇటీవల కాలంలో పలువురు కీలక మావోయిస్టు నేతలు లొంగిపోతున్న నేపథ్యంలో, దాదాపు నాలుగున్నర దశాబ్దాల అనుభవం ఉన్న బండి ప్రకాశ్ వంటి సీనియర్ నేత లొంగిపోవడం పార్టీకి కోలుకోలేని దెబ్బ అని పోలీసు వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ పరిణామం మావోయిస్టు ఉద్యమంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.
