బీఆర్ఎస్ చరిత్ర ఈ ఉప ఎన్నికతో ముగిసిపోతుంది: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

V. Sai Krishna Reddy
1 Min Read

జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరగబోయే ఉపఎన్నికతో బీఆర్ఎస్ కథకు చరమగీతం పాడబోతున్నామని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చారిత్రక తీర్పు ఇచ్చి, బీఆర్ఎస్‌ను రాజకీయంగా సమాధి చేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం నాడు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా వెంగళరావునగర్ డివిజన్‌లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా విధ్వంసానికి గురైందని ఆరోపించారు. “బీఆర్ఎస్ పాలన అంటేనే అవినీతి, అణచివేత. ఇప్పుడు ఆ పార్టీకి శాశ్వతంగా ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది. ఈ ఉపఎన్నికలో బీఆర్ఎస్‌ను పూర్తిగా తిప్పికొట్టాలి” అని ఆయన కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరాన్ని ఒక ‘మినీ ఇండియా’గా తీర్చిదిద్దేందుకు అద్భుతమైన దార్శనికతతో పనిచేస్తున్నారని తుమ్మల ప్రశంసించారు. జూబ్లీహిల్స్ ఓటర్లు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వానికి మద్దతుగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. “రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఈ ప్రగతిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి” అని అన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్థానికుడు కావడంతో ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని మంత్రి తుమ్మల తెలిపారు. నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే నియోజకవర్గంలో రోడ్లు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఆయన గెలుపుతో ఈ ప్రాంత అభివృద్ధి వేగవంతం అవుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కాగా, జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నవంబరు 11న పోలింగ్ జరగనుండగా, నవంబరు 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *