రూ.5 వేలకే ఫార్మకోజెనోమిక్స్ టెస్ట్.. ఇక మందుల దుష్ప్రభావాలకు చెక్!

V. Sai Krishna Reddy
2 Min Read

మీ శరీరానికి ఏ మందులు సరిగ్గా సరిపోతాయో జీవితాంతం మార్గనిర్దేశం చేసే ఒకే ఒక్క పరీక్ష అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి అత్యాధునిక వైద్యాన్ని సామాన్యులకు చేరువ చేస్తూ హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్స్ ఓ కీలక ముందడుగు వేసింది. జెన్‌పవర్‌ఆర్‌ఎక్స్ సంస్థతో కలిసి ‘ఫార్మకోజెనోమిక్స్’ అనే ప్రత్యేకమైన జన్యు పరీక్షను ప్రారంభించింది. ఈ పరీక్ష ద్వారా ఒక వ్యక్తి జన్యు స్వభావాన్ని బట్టి ఏ మందులు సమర్థవంతంగా పనిచేస్తాయో, వేటి వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయో ముందుగానే తెలుసుకోవచ్చు.

ప్రతి వ్యక్తి శరీరం మందులకు స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది. ఒకరికి అద్భుతంగా పనిచేసిన మందు, మరొకరిపై ఎలాంటి ప్రభావం చూపకపోవచ్చు లేదా హాని కూడా కలిగించవచ్చు. ఈ సమస్యను అధిగమించేందుకు ఈ జన్యు పరీక్ష దోహదపడుతుంది. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్, జీర్ణకోశ, నరాల సంబంధిత సమస్యలు, మానసిక వ్యాధులు, నొప్పి నివారణ వంటి అనేక అనారోగ్యాలకు వాడే మందులకు శరీరం ఎలా స్పందిస్తుందో ఈ టెస్ట్ విశ్లేషిస్తుంది.

విదేశాల్లో ఇలాంటి పరీక్షకు సుమారు రూ. 80,000 ఖర్చవుతుండగా, ఏఐజీలో కేవలం రూ. 5,000కే అందిస్తున్నట్లు హాస్పిటల్స్ చైర్మన్ డా. డి. నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ‘‘ఈ పరీక్ష ఫలితాలతో ఒక వ్యక్తిగత రిపోర్ట్ బుక్‌లెట్ ఇస్తాం. దీనిని జీవితకాలంలో ఎప్పుడైనా, ఏ డాక్టర్‌కైనా చూపించి, తమ జన్యువులకు సరిపడే మందులనే వాడొచ్చు’’ అని ఆయన వివరించారు.

ఈ పరీక్ష కోసం కేవలం 2 మిల్లీలీటర్ల రక్త నమూనా తీసుకుంటారు. ఆ రక్తం నుంచి డీఎన్ఏను వేరుచేసి, ఇల్యూమినా, ఎంజీఐ వంటి అత్యాధునిక ప్లాట్‌ఫామ్‌లపై విశ్లేషిస్తారు. సుమారు 120 నుంచి 190 జన్యువులను పరిశీలించి, శరీరం మందులను ఎలా జీర్ణం చేసుకుంటుందో అంచనా వేస్తారు. ఈ ప్రక్రియకు 12 నుంచి 13 రోజులు పడుతుందని ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన హార్వర్డ్ మెడికల్ స్కూల్ క్లినికల్ జెనోమిక్స్ నిపుణురాలు హిమ చల్ల తెలిపారు.

ఈ పరీక్ష రూపకల్పనలో ఏఐజీ హాస్పిటల్స్ 2,000 మంది భారతీయులపై జరిపిన అధ్యయనంతో పాటు, యూకే బయోబ్యాంక్ డేటాను కూడా ఉపయోగించారు. దీనివల్ల భారతీయుల జన్యువులకు సంబంధించిన ప్రత్యేకతలను పరిగణనలోకి తీసుకుని కచ్చితమైన ఫలితాలను అందిస్తున్నారు. ఈ పరీక్ష వల్ల అనవసరమైన మందుల వాడకం, అధిక డోసేజీల బెడద తప్పుతుందని, తద్వారా మందుల దుష్ప్రభావాల వల్ల కలిగే ఆసుపత్రి ఖర్చులు కూడా తగ్గుతాయని డా. నాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *