భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) తన పసిడి నిల్వలను భారీగా పెంచుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో, సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం కొనుగోళ్లను వేగవంతం చేసింది. ఫలితంగా, ఆర్బీఐ వద్ద ఉన్న బంగారం నిల్వలు 880 మెట్రిక్ టన్నుల మైలురాయిని దాటాయి.
ఆర్బీఐ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో (సెప్టెంబర్ చివరి నాటికి) 0.6 టన్నుల (600 కిలోలు) బంగారాన్ని కొనుగోలు చేసింది. ఇందులో జూన్ నెలలో 0.4 టన్నులు, సెప్టెంబర్ నెలలో 0.2 టన్నులు (200 కిలోలు) సమీకరించింది. దీంతో సెప్టెంబర్ 26, 2025 నాటికి ఆర్బీఐ మొత్తం బంగారం నిల్వలు 880.18 టన్నులకు చేరాయి. ఈ నిల్వల మొత్తం విలువ 95 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉందని ఆర్బీఐ తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ అనిశ్చితులు పెరిగిపోవడమే బంగారం కొనుగోళ్లకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయాల్లో బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా సెంట్రల్ బ్యాంకులతో పాటు సాధారణ పెట్టుబడిదారులు కూడా భావిస్తారు. ఈ డిమాండ్ కారణంగానే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని ఆర్బీఐ తన బులెటిన్లో పేర్కొంది. ముఖ్యంగా సెప్టెంబర్లో పసిడి ధరలు ఆల్టైమ్ గరిష్ఠాన్ని తాకాయి.
కేవలం ఆర్బీఐ మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు కలిసి సుమారు 166 టన్నుల బంగారాన్ని తమ అధికారిక నిల్వలకు జోడించినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ మొత్తం 54.13 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.